కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం — SIT రంగంలోకి దిగింది.
దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కేసుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఈ కేసును అత్యంత సున్నితంగా పరిగణిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ స్వయంగా కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. భగీరథ్‌ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసుకు సంబంధించిన ప్రాథమిక వివరాలను ఏసీపీ, సీఐల నుంచి డీసీపీ రితిరాజ్ సేకరించారు. ఫిర్యాదు ఎలా వచ్చింది? బాధితురాలి వాంగ్మూలం ఏమిటి? ఘటనకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు ఏమైనా ఉన్నాయా? వంటి అంశాలపై అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు.
మరోవైపు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసే అవకాశముంది. అలాగే బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.
ఈ కేసులో మెడికల్ పరీక్షల ఫలితాలు అత్యంత కీలకంగా మారనున్నాయి. దర్యాప్తు దిశను అవే నిర్ణయించే అవకాశం ఉందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇప్పటికే కేసు రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకోవడంతో పోలీసులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ఆధారాల ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
ఇక మరోవైపు భగీరథ్ ఇప్పటికే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై త్వరలో వెకేషన్ బెంచ్‌లో విచారణ జరగనుంది.
ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తు, మెడికల్ టెస్ట్ రిపోర్టులు, బాధితురాలి స్టేట్‌మెంట్ ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారాయి.


