స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖ తరుపున హరితోత్సవం ఘనంగా నిర్వహిస్తామని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ( పీసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్ వెల్లడించారు. ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. అన్ని జిల్లాల అటవీ అధికారులతో పీసీసీఎఫ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత చాలా ముందు చూపుతో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు తెలంగాణాకు హరితహారం ప్రారంభించారని గత తొమ్మిదేళ్లుగా ఈ పథకం అద్భుత విజయాలు సాధించిందని తెలిపారు. అదే ఉత్సాహంలో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించే హరితోత్సవాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరారు. ప్రతీ గ్రామ స్థాయి నుంచి, మండలం, జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
రాష్ట్ర మంతటా పరుచుకున్న పచ్చదనం, ప్రతీ గ్రామంలో వెలిసిన నర్సరీలు, ప్రకృతి వనాలు, రోడ్ల వెంట అవెన్యూ ప్లాంటేషన్, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, అటవీ పునరుద్ధరణ ఫలాలను ప్రతీ ఒక్కరూ అనుభవిస్తున్నారని, ఇవే విజయాలను పోస్టర్లు, వీడియోల ద్వారా ప్రదర్శించాలని తెలిపారు. 19 న రాష్ట్రంలో ఉన్న అన్ని నేషనల్ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, జూ పార్కుల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు పిసిసిఎఫ్ వెల్లడించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల అటవీ అధికారులు, గ్రామీణ అభివృద్ధి, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ అధికారులు పాల్గొన్నారు.