దేశవ్యాప్తంగా మూడో దశ ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మొత్తం 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనుంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, హరియాణా, ఝార్ఖండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్, త్రిపుర రాష్ట్రాల్లో కూడా ఈ ప్రక్రియ కొనసాగనుంది.
ఈ దశలో దేశవ్యాప్తంగా 3.94 లక్షలకుపైగా బూత్ స్థాయి అధికారులు (BLOలు) దాదాపు 36.73 కోట్ల మంది ఓటర్ల ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరించనున్నారు. త్రిపురలో డిసెంబర్ 23తో మూడో దశ ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియనుంది. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని ఎన్నికల సంఘం కోరింది.
ఏపీలో షెడ్యూల్ ఇలా..
ఆంధ్రప్రదేశ్లో జూన్ 5 నుంచి 14 వరకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. జూన్ 15 నుంచి జులై 14 వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారు. అనంతరం జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు.
జులై 21 నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు, మార్పుల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. అన్ని పరిశీలనల అనంతరం సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు.
తెలంగాణలో ప్రక్రియ ఇలా..
తెలంగాణలో జూన్ 15 నుంచి 24 వరకు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటి సర్వే చేపడతారు.
జులై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసి… అదే రోజు నుంచి సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అన్ని సవరణల అనంతరం అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు.


