వానాకాలం అంటే వ్యాధుల కాలం. సీజనల్ వ్యాధులు ప్రబలి జనం మంచాన పడే కాలం. దోమలు వృద్ధి చెంది స్వైర విహారం చేస్తూ మనల్ని డెంగ్యూ వ్యాధికి గురి చేసే పరిస్థితులు కూడా ఇదే కాలం. ఇప్పుడు తెలంగాణలో జరుగుతోంది కూడా ఇదే. డెంగ్యూ వ్యాధి తెలంగాణను వణికిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఈ వ్యాధిబారినపడి రంగారెడ్డి జిల్లాలో 11 ఏళ్ల బాలుడి మృతి చెందడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 964 డెంగీ కేసులు నమోదు అయినట్టు నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్-బోర్న్ డిసీజ్ కంట్రోల్ అధికారులు వెల్లడించారు. గత ఏడాది 706 కేసులు నమోదుకాగా.. ఈ ఏడాది కేసుల తీవ్రత పెరుగడంతో అధికారులు అలర్ట్ ఉండాలని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, ఖమ్మం జిల్లాల్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ఈ జిల్లాలు ప్రమాదకరస్థాయిలో ఉన్నట్లు తెలిపారు. కేసుల వివరాలు చూసుకుంటే,.. హైదరాబాద్‌లో 327, ఖమ్మం జిల్లాలో 161, మేడ్చల్‌లో 103 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది తొలి ఆరు మాసాల్లో ఈ మూడు జిల్లాల్లో కేవలం 282 కేసులే నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి ఈ ఏడాది డెంగీ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. డెంగీతో పాటు మలేరియా, చికున్‌గున్యా కేసులు కూడా పెరుగుతున్నాయి.
వానా కాలం అంటేనే వ్యాధుల కాలం. ఎక్కడ పడితే అక్కడ నీరు నిలిచి విచ్చలవిడిగా దోమలు వీరవిహారం చేసే పరిస్థితులు. ముఖ్యంగా డెంగ్యూ దోమలు గుడ్లు పెట్టేందుకు ఇదే సరైన సమయం. నిలిచిన నీరు, అధిక తేమ ఏడిస్ దోమ వృద్ధికి కారణమవుతాయి. అందుకే పరిసరాల పరిశుభ్రత ఈకాలంలో చాలా ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరోవైపు కాలం మారుతోన్న కొద్ది డెంగ్యూ కూడా ముదురుతోంది. మరింత ప్రమాదకరంగా మారుతోంది. డాక్టర్లు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు.
డెంగ్యూ వస్తే జ్వరం వస్తుంది. అది ముదిరితే.. రక్తంలో క్రమేనా ప్లేట్‌లెట్స్ పడిపోవడం మొదలవుతుంది. వెంటనే చికిత్స తీసుకోకపోతే అది ప్రాణాలకే ముప్పు. అయితే, ఈ వైరల్ ఫీవర్ మనకు తెలియకుండానే మరో నష్టాన్ని కలిగిస్తుందని.. నరాల సంబంధిత సమస్యలను తెచ్చిపెడుతోందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఎన్సెఫాలిటిస్, మెనింజైటిస్, మైలిటిస్, మెదడు, వెన్నుపాము వాపుకు కారణమవుతాయని.. ఫలితంగా డెంగ్యూ రోగులు తరచు తలనొప్పితో బాధపడతారని.. అంతేకాకుండా వారి మానసిక స్థితిలో కూడా మార్పులు వస్తాయంటున్నారు. కొందరు కోమాలోకి వెళ్లే పరిస్థితి కూడా వస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గినప్పుడు శరీరంలోని వివిధ భాగాల్లో రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. ఈ క్రమంలోనే మెదడులోనూ రక్తస్రావం జరిగి పరిస్థితి మరింత దిగజారే ముప్పు ఉంది. కాబట్టి, డెంగ్యూను తేలిగ్గా తీసుకోవద్దు. ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చులే అనుకోవద్దు. డెంగ్యూ రోగిని హాస్పిటల్‌లో చేర్చి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచడం చాలా మంచిదని సూచిస్తున్నారు.