రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో లక్ష్యాల ప్రకారం పనులు పూర్తిచేయాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అలా చేయకపోతే సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి జలవనరులశాఖ ప్రాజెక్టులపై గురువారం సమీక్షించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులపైనా సమీక్షించారు. తొలుత అధికారులు పోలవరం పనులపై ప్రజంటేషన్ ఇచ్చారు. పోలవరం డయాఫ్రం వాల్ పనుల పురోగతిపై సీఎం కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి భారీ ప్రాజెక్టుల్లో రోజుకు, నెలకు ఎంత పని జరగాలనేది లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. అందుకు తగ్గట్టుగా పని పూర్తయ్యేలా చూసుకోవాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు.
నిధులు జాప్యం లేని ప్రాజెక్టుల్లో పనుల జాప్యాన్ని సహించం అని సీఎం తేల్చి చెప్పారు. పోలవరం ప్రధాన డ్యాం పనులు 2027 డిసెంబరు నాటికి పూర్తిచేయాల్సిందేనని సీఎం అన్నారు. ఎడమ కాలువలో 17 వేల 500 క్యూసెక్కుల స్థాయికే కాలువ నిర్మాణం చేపట్టాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయి పూర్తిస్థాయిలో నీళ్లు అందుబాటులోకి వచ్చేనాటికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు చెప్పారు.