స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అనంతరం బండి సంజయ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ సుదీర్ఘమైన ట్వీట్ పోస్ట్ చేశారు. తనలాంటి సాధారణ కార్యకర్తకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసే గొప్ప అవకాశం ఇచ్చినందుకు గాను పార్టీ జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తాను బీజేపీ హైకమాండ్ అంచనాలకు అనుగుణంగానే పని చేశానని భావిస్తున్నానని చెప్పారు. తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. తనకు అందించిన మద్దతు, ప్రేమ, ప్రోత్సాహానికి గాను సెంట్రల్ పార్టీకి, రాష్ట్ర నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే.. అన్ని మోర్చాల నాయకులు, సభ్యులకు, సంగ్రామ సేన, రాష్ట్ర పార్టీ కార్యాలయ ఉద్యోగులు, సోషల్ మీడియా యోధులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. తాను మీలో ఒకడినని, ఎల్లప్పుడూ అలాగే ఉంటానని అన్నారు. కిషన్ రెడ్డి సమర్ధవంతమైన నాయకత్వంలో తాను నూతనోత్సాహంతో పార్టీ కోసం పని చేసేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు.
2020 మార్చి 11న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా బండి సంజయ్ నియామకం అయ్యారు. మూడేళ్ల అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారు. అయితే బండి సంజయ్ కి కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వనున్నట్లు ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆయనకు నిజంగానే కేంద్ర మంత్రి పదవి ఇస్తారా అనేది చూడాలి.