ఎర్రవల్లి భూముల వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకటాపూర్, ఎర్రవల్లి గ్రామాల మధ్య ఓవర్‌ల్యాప్ భూములు ఉన్నాయని.. వాటిపై పూర్తి లెక్క తేలాల్సి ఉందని తెలిపారు. ఓవర్‌ల్యాప్ ల్యాండ్‌లోనే కేసీఆర్ తిష్ట వేశారని మంత్రి వ్యాఖ్యానించారు. అసైన్డ్ భూమి ఉండాల్సినంత లేదని.. బినామీ పేర్లతో భూమి బదిలీ అయ్యిందని చెప్పారు.
భూములను చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని పొంగులేటి స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో భూముల విస్తీర్ణం ఎక్కువగా, తక్కువగా ఉన్నట్లు తేలితే.. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తామని తెలిపారు.
నిజమైన జమిందార్ అయితే 2004లో కేసీఆర్ ఆ విషయాన్ని ఎందుకు చూపించలేదని మంత్రి నిలదీశారు. 2004లో తనకు ఒక ఎకరం మాత్రమే ఉందని కేసీఆర్ చూపించారని పొంగులేటి అన్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఏమి చూపించారు? ప్రస్తుతం వాస్తవంగా ఎంత భూమి ఉంది? అనే అంశాలను కూడా పరిశీలిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
ఒరిజినల్ పట్టా ఉన్న భూముల్లో ప్రస్తుతం బయట వ్యక్తులు ఉన్నారా? అనే విషయాలు కూడా తేలాల్సి ఉందని పొంగులేటి చెప్పారు. అసైన్డ్ భూములకు ఒరిజినల్ పట్టాలు ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
అసైన్డ్ భూములకు పట్టాలు పొంది ఉన్నవారిని అధికారులు ఇబ్బంది పెడితే.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని పొంగులేటి హెచ్చరించారు. అయితే పట్టాలు లేకుండా మరొకరు భూమిలో పొజిషన్‌లో ఉన్నట్లు తేలితే.. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలన్న దానిపై ఆలోచిస్తామని చెప్పారు.


