తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన కొత్త పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’ సరికొత్త సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. మొన్నటి వరకు బతుకమ్మ, బోనాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆమె.. ఇప్పుడు తన రాజకీయ పంథాను పూర్తిగా మార్చేశారు. ఒకవైపు గుళ్లూ గోపురాలు తిరుగుతూ హిందుత్వ ఓటు బ్యాంకుపై కన్నేసిన కవిత.. మరోవైపు వామపక్ష నేతలు, మాజీ మావోయిస్టులను కలుస్తూ లెఫ్ట్ భావజాలాన్ని కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికితోడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగిన బాధితులను అక్కున చేర్చుకుంటూ కొత్త సెంటిమెంట్‌కు తెరతీస్తున్నారు. ఇంతకీ రెండు పడవల ప్రయాణంలా కనిపిస్తున్న కవిత ఈ సరికొత్త వ్యూహం వర్కౌట్ అవుతుందా? తెలంగాణ రాజకీయాల్లో ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలుగుతారా?
రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకునే దిశగా కల్వకుంట్ల కవిత అడుగులు వేస్తున్నారు. సొంతంగా రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఆమె అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె ఒకే భావజాలానికి పరిమితం కాకుండా భిన్నమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన, బతుకమ్మ, బోనాల సంస్కృతి పరిరక్షణ వంటి అంశాలపై మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేసిన కవిత.. ఇప్పుడు తన అప్రోచ్‌ను మార్చేశారు. హిందూ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ఆమె ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్త పార్టీ యాక్టివిటీస్ మొదలుపెడుతున్న తరుణంలో ఆమె యాదగిరిగుట్ట, వేములవాడ, బాసర లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తద్వారా సంప్రదాయవాద, భక్తి భావాలు కలిగిన వర్గాలకు చేరువ కావాలన్నది ఆమె ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు అదే సమయంలో వివిధ వామపక్ష పార్టీల ప్రతినిధులతో, ట్రేడ్ యూనియన్ లీడర్లతో, ప్రజా సంఘాల నాయకులతో ఆమె వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. భిన్నమైన సిద్ధాంతాలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేలా ఆమె చేస్తున్న ఈ ప్రయోగాలు పొలిటికల్ స్ట్రాటజిస్టులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.
తెలంగాణలో ఏ నాయకుడైనా బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలంటే ఒకే వర్గానికి పరిమితం కాకుండా అన్ని వర్గాలను కలుపుకుపోవాల్సి ఉంటుంది. సరిగ్గా ఇదే సూత్రాన్ని కవిత ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ‘నక్సలైట్లే నిజమైన దేశభక్తులు’ అనే నినాదాన్ని ఇచ్చి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో కేసీఆర్ సైతం ‘నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా’ అంటూ వామపక్ష సానుభూతిపరులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు కవిత ప్రస్తుత రాజకీయ పంథా కూడా సరిగ్గా అదే తరహాలో ఉందన్న చర్చ జరుగుతోంది. లెఫ్ట్ భావజాలాన్ని తమ వైపు తిప్పుకునే క్రమంలో కవిత ఇటీవల అనారోగ్యంతో ఉన్న మాజీ మావోయిస్టు నేత దేవ్‌జీని ఆసుపత్రిలో స్వయంగా వెళ్లి పరామర్శించారు. పైకి ఇది కేవలం ఒక వ్యక్తిగత, మానవతా దృక్పథంతో కూడిన చర్యగా కనిపిస్తున్నప్పటికీ.. దీని వెనుక ఒక స్పష్టమైన, బలమైన రాజకీయ ఎత్తుగడ దాగి ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఉద్యమకారులు, వామపక్ష సానుభూతిపరుల మద్దతును కూడగట్టుకునేందుకే ఆమె ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని స్పష్టమవుతోంది.
కొత్త పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’ స్థాపించిన తర్వాత కవిత తీసుకున్న మరో సంచలన నిర్ణయం బీఆర్ఎస్ బాధితులను కలవడం. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్యాయానికి గురైన వారిని స్వయంగా కలుస్తూ వారికి అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. పాత పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచే ఈ తరహా సమావేశాలు ప్రారంభించిన కవిత.. ఇప్పుడు వాటిని మరింత ముమ్మరం చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల కుటుంబాలను గుర్తించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆమె ఇప్పటికే బహిరంగంగా విమర్శించారు. తాజాగా సిరిసిల్ల జిల్లాకు చెందిన నేరెళ్ల బాధితులతో కవిత ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో మానేరు నదిలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు పోలీసులు, అప్పటి పాలకులు తమను ఎంతలా వేధించారో బాధితులు ఆమె ముందు కన్నీటి పర్యంతమయ్యారు. వారి బాధలు సావధానంగా విన్న కవిత.. నేరెళ్ల ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సొంత కుటుంబం నడిపిన ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ ఆమె చేస్తున్న ఈ పోరాటం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రస్తుత తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే.. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండగా, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కొనసాగుతోంది. మరోవైపు జాతీయ పార్టీ బీజేపీ రాష్ట్రంలో తన ఉనికిని మరింత విస్తరించే ప్రయత్నాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నమైంది. దేశవ్యాప్తంగా రాజకీయాలన్నీ హిందుత్వ, లౌకికవాద, జాతీయవాద భావజాలాల చుట్టూనే తిరుగుతున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం ప్రాంతీయత, సామాజిక న్యాయం, సంక్షేమం, సాంస్కృతిక గుర్తింపు వంటి అంశాలే ఇప్పటికీ అత్యంత ఎఫెక్టివ్‌గా, ఎమోషనల్‌గా పనిచేస్తుంటాయి. ఇలాంటి అత్యంత పోటీ వాతావరణంలో కొత్త రాజకీయ పార్టీగా బరిలోకి దిగిన కవితకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం అత్యంత అనివార్యంగా మారింది. అందుకే ఆమె ఏ ఒక్క వర్గాన్నీ దూరం చేసుకోకూడదనే పక్కా ముందుచూపుతో అడుగులు వేస్తున్నారు. ఇటు మెజారిటీ వర్గాల హిందూ భావోద్వేగాలను గౌరవిస్తూనే.. అటు సామాజిక న్యాయం, వామపక్ష వర్గాల పోరాటాలకు చేరువగా ఉన్నామనే క్లియర్ మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. అన్ని వర్గాల ఎజెండాలను తన ఎజెండాలో ఇమిడ్చేలా వ్యూహరచన చేస్తున్నారు.
కల్వకుంట్ల కవిత అమలు చేస్తున్న ఈ సరికొత్త వ్యూహాలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. ప్రజల భావోద్వేగాలు, తెలంగాణ ఉద్యమ వారసత్వం, ఆధ్యాత్మిక అంశాలు, సామాజిక న్యాయం, అస్తిత్వ పోరాటాలు.. ఇలా భిన్నమైన అంశాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ఒక సరికొత్త సోషల్ ఇంజనీరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కవిత వేస్తున్న ఈ అడుగులు కేవలం తాత్కాలిక రాజకీయ చర్చకే పరిమితం అవుతాయా లేక తెలంగాణ రాజకీయాల్లో ఆమెకంటూ ఒక సుస్థిరమైన, శాశ్వతమైన కొత్త స్పేస్ క్రియేట్ అవుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. రాబోయే నెలల్లో ఆమె చేపట్టబోయే పార్టీ నిర్మాణ ప్రక్రియ, క్షేత్ర స్థాయిలో కేడర్‌ను సిద్ధం చేసే విధానం, రూపొందించే పూర్తిస్థాయి ఎజెండా, నిర్వహించే రాజకీయ కార్యాచరణ పైనే ఆమె పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే పాత మూస పద్ధతులను పక్కనపెట్టి, ఒక వినూత్నమైన రాజకీయ నాయకురాలిగా ప్రజల్లోకి వెళ్లడంలో ఆమె వేగంగా పావులు కదుపుతున్నారన్నది మాత్రం సుస్పష్టం. మరి కవిత వ్యూహాలు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయో చూడాలి మరి.


