తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల సమరానికి ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపై కమలం పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. అయితే, గత గ్రేటర్ ఎన్నికల్లో తన ప్రసంగాలతో పార్టీకి అనూహ్య సీట్లు తెచ్చిపెట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈసారి హైదరాబాద్ ప్రచారానికి దూరంగా ఉండబోతున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ గ్రేటర్ ప్రచారానికి బండి సంజయ్ ఉద్దేశపూర్వకంగానే దూరం జరుగుతున్నారా? అధిష్టానం వద్ద వరంగల్ బాధ్యతలు తీసుకునేందుకు ఆయన ఎందుకు ఆసక్తి చూపుతున్నారు?
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగారా మోగబోతోంది. పదవీకాలం ముగిసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో పాటు.. గతంలో వివిధ కారణాలతో ఎన్నికలు ఆగిపోయిన పలు మున్సిపాలిటీలకు త్వరలోనే పోలింగ్ నిర్వహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న మూడు కీలక కార్పొరేషన్లతో పాటు.. వరంగల్, ఖమ్మం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మున్సిపల్ పోరు కోసం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే వ్యూహరచన మొదలుపెట్టాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ కూడా క్షేత్రస్థాయిలో గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన సానుకూల ఫలితాలను స్థానిక సంస్థల్లో కూడా పునరావృతం చేయాలని కమలం పార్టీ నాయకత్వం పక్కా ప్రణాళికలు రచిస్తోంది. స్థానిక సమస్యలపై పోరాటాలు చేస్తూ, ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు బూత్ స్థాయి నుంచి నాయకులను సమాయత్తం చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి పార్టీ యంత్రాంగాన్ని వంద శాతం సన్నద్ధం చేసే దిశగా కాషాయ దళం అడుగులు వేస్తోంది.
గత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, భారతీయ జనతా పార్టీ సాధించిన విజయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎవరూ ఊహించని స్థాయిలో కార్పొరేటర్ స్థానాలను గెలుచుకుని జీహెచ్ఎంసీలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఆ అద్భుత ఫలితాల వెనుక నాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ శ్రమ ఎంతో ఉందని స్థానిక కేడర్ బలంగా విశ్వసిస్తుంది. తనదైన మాస్ ప్రసంగాలతో ఆయన పార్టీలో కొత్త జోష్ తీసుకురావడంతో పాటు, నగర ప్రజలను పార్టీ వైపు విశేషంగా ఆకర్షించగలిగారు. కరీంనగర్ కార్పొరేషన్‌ను విజయవంతంగా తమ ఖాతాలో వేసుకున్న తర్వాత, తమ తదుపరి లక్ష్యం గ్రేటర్ హైదరాబాద్ పీఠమేనని బండి సంజయ్ అప్పట్లోనే ప్రకటించారు. ఆయన నేతృత్వంలోనే వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ మెరుగైన పనితీరును కనబరిచింది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంలో, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడంలో బండి సంజయ్ పోషించిన పాత్రను పార్టీ శ్రేణులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటాయి.
గత మున్సిపల్ ఎన్నికలకు, ప్రస్తుత ఎన్నికలకు రాజకీయ పరిస్థితులు పూర్తి భిన్నంగా మారాయి. గత ఎన్నికల సమయంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నందున, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తిరిగి ప్రచారం చేసే అవకాశం, బాధ్యత.. ఆయనపై ఉండేవి. కానీ ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా జాతీయ స్థాయి బాధ్యతల్లో ఉన్నారు. వీటన్నింటికీ మించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు కమలం పార్టీకి బలమైన ఎంపీల ప్రాతినిధ్యం ఉంది. కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావుల నియోజకవర్గాలు గ్రేటర్ పరిధిలోనే విస్తరించి ఉన్నాయి. ఈ నలుగురు కీలక నాయకులు స్థానిక మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను నేరుగా పర్యవేక్షించనున్నారు. ఇంతమంది అగ్ర నేతలు ఇక్కడ ఉన్నప్పుడు, తానెళ్లి ప్రచారం చేయడం కంటే వారికే పూర్తి స్వేచ్ఛ వదిలేయడం సబబని బండి సంజయ్ భావిస్తున్నారు. ఈ సామాజిక, రాజకీయ లెక్కలన్నీ బేరీజు వేసుకునే ఆయన గ్రేటర్ ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
గ్రేటర్ ఎన్నికలకు బండి సంజయ్ దూరం కావడానికి ఎంపీల ప్రాబల్యం మాత్రమే కాకుండా, పార్టీ అంతర్గత వ్యవహారాలు కూడా కారణమనే చర్చ నడుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొందరు స్థానిక సీనియర్ నాయకులకు, బండి సంజయ్ కు మధ్య కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు స్థానిక నాయకులకు రుచించలేదన్న అభిప్రాయం ఉంది. ఆ పాత విభేదాల నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ గ్రేటర్ రాజకీయాల్లో తలదూర్చి అనవసరమైన విమర్శలు కొనితెచ్చుకోవడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. స్థానిక నేతల వ్యవహారాల్లో జోక్యం చేసుకుని, అధికార కేంద్రాల మధ్య ఘర్షణకు తావివ్వకూడదన్న ఉద్దేశ్యంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిర్ణయం కంటే కూడా, బండి సంజయ్ వ్యక్తిగతంగానే గ్రేటర్ ప్రచారం పట్ల ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. వ్యూహాత్మకంగా ఆయన హైదరాబాద్ మున్సిపల్ రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంటున్నారు.
హైదరాబాద్ ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న బండి సంజయ్, తన రాజకీయ దృష్టిని పూర్తిగా వరంగల్ నగరం వైపు మళ్లించారు. గ్రేటర్ పరిధిలో ఎలాగూ నలుగురు ఎంపీలు బాధ్యతలు చూసుకుంటారు కాబట్టి, తాను వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన తన మనసులోని మాటను ఇప్పటికే పార్టీ జాతీయ నాయకత్వానికి స్పష్టంగా తెలియజేశారు. వరంగల్ కు పార్టీ ఇన్‌ఛార్జిగా వెళ్లి, అక్కడ గ్రౌండ్ లెవెల్ లో పనిచేసి బీజేపీకి మున్సిపల్ పీఠం దక్కేలా చేస్తే తనకు రాజకీయంగా ఎంతో తృప్తిగా ఉంటుందని బండి సంజయ్ భావిస్తున్నారు. తన సొంత జిల్లా కరీంనగర్‌కు సమీపంలో ఉండటం కూడా వరంగల్ పై ఆయన ఆసక్తికి మరో కారణం. వరంగల్ లో తనదైన మాస్ అప్పీల్ కచ్చితంగా పనిచేస్తుందని ఆయన నమ్ముతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలోని పార్టీ పెద్దలు బండి సంజయ్‌కు అధికారికంగా ఎక్కడ బాధ్యతలు అప్పగిస్తారన్న దానిపై తెలంగాణ బీజేపీ కేడర్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.


