ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్ బర్గ్ ఇప్పటి వరుకు ఎన్నో అద్భుత చిత్రాలను అందించారు. మూడు సార్లు బెస్ట్ డైరెక్టర్ గా ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు. ఈ హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ స్పీల్ బర్గ్ 80 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన చిత్రం అందించేందుకు తపిస్తున్నారు. డిస్ క్లోజర్ డే అనే మూవీని లేటెస్ట్ గా తెరకెక్కించారు. ఈ మూవీ జూన్ 12న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ క్రేజీ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో.. ఏఐ గురించి స్పీల్ బర్గ్ తన మనసులో మాటలను బయటపెట్టారు. ఇంతకీ.. డిస్ క్లోజర్ డే ట్రైలర్ ఎలా ఉంది..? ఏఐ గురించి స్పీల్ బర్గ్ ఏం చెప్పారు..?
స్పీల్ బర్గ్ 1982లో తీసిన ది ఎక్స్ ట్రా టెర్రిస్ట్రైయిల్, 2005లో తీసిన వార్ ఆఫ్ వరల్డ్స్ సినిమాల తర్వాత మళ్లీ ఇప్పుడు అంటే రెండు దశబ్దాల అనంతరం మరోసారి భూమికి, బయట ఉన్న జీవులకు సంబంధించిన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అదే.. డిస్ క్లోజర్ డే. ఈ చిత్రంలో Emily Blunt, Josh O’Connor, Eve Henson మరియు Colin Firth ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
మూడు నిమిషాల నిడివి గల Disclosure Day ట్రైలర్లో జోష్ ఓ’కానర్ మరియు ఎమిలీ బ్లంట్ పాత్రలు గుర్తు తెలియని శక్తి దాడికి గురవుతారు. ట్రైలర్ మొత్తం స్పీల్బర్గ్ కనిపిస్తూ మనుషులే విశ్వంలో ఉన్న ఏకైక మేధావి జీవులు కాదనే నమ్మకం తనను ఈ సినిమా తీయడానికి ప్రేరేపించిందని చెప్పారు. ఈ సినిమా 1947లో జరిగిన ఘటన ఆధారంగా రూపొందినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్ వ్యూలో స్పీల్బర్గ్ భూమికి బయట ఉన్న జీవుల గురించి ఉన్న సిద్ధాంతాలపై ఎలా పరిశోధన చేశారో వివరించారు.
ఇటీవల Michelle Obama తో జరిగిన ఒక పోడ్కాస్ట్లో స్పీల్బర్గ్, సినిమా నిర్మాణంలో ఏఐ ఉపయోగం గురించి కూడా మాట్లాడారు. ఏఐని ఒక సాధనంగా ఉపయోగించవచ్చని, కానీ కళపై తుది నిర్ణయం మాత్రం ఏఐది కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏఐ మానవ భావోద్వేగాలను ఎప్పటికీ భర్తీ చేయలేదని స్పీల్బర్గ్ అన్నారు. తన సినిమాల్లో పాత్రలు ఎలా ప్రవర్తించాలి..? కెమెరా ఎలా కదలాలి..? వంటి విషయాల్లో ఏఐ జోక్యం చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పారు. తన కథలో విలన్ సరిగా లేడని.. ఏఐ చెప్పకూడదు. నా డైలాగులు ఎలా రాయాలో చెప్పకూడదు. కెమెరా ఎక్కడికి వెళ్లాలో కూడా చెప్పకూడదు అని ఆయన అన్నారు. “ఏఐ నాకు లొకేషన్లు కనుగొనడంలో సహాయం చేస్తే బాగానే ఉంటుంది. దాంతో మా పని కొంత తగ్గుతుంది. ఏఐని ఒక సాధనంగా ఉపయోగించండి. కానీ దానిదే అంతిమ నిర్ణయం కాకూడదు అన్నారు.


