హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో ఒక్కో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. సాధారణ దోపిడీ హత్యగా భావించిన ఈ కేసు వెనుక దేశవ్యాప్తంగా విస్తరించిన భారీ నేర ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నేపాల్‌కు చెందిన సాహు గ్యాంగ్ ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తేలడంతో దర్యాప్తు మరింత వేగవంతమైంది. ముఖ్యంగా ఢిల్లీలోని జైలు నుంచే ఈ మొత్తం హత్యా కుట్రకు స్కెచ్ వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు కల్పన కోసం పుణేలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంట్లో పనిచేసే పనిమనిషి కల్పనే ఈ హత్యకు కీలక పాత్ర పోషించినట్లు తేలింది. ఇంటి పరిస్థితులు, నగలు, డబ్బు, కుటుంబ సభ్యుల కదలికలపై పూర్తి సమాచారం సేకరించిన ఆమె.. ఆ వివరాలను సాహు గ్యాంగ్‌కు చేరవేసినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం ముంబై, నేపాల్, పాట్నా ప్రాంతాలకు చెందిన వేర్వేరు వ్యక్తులను హైదరాబాద్‌కు రప్పించి పక్కా ప్రణాళిక ప్రకారం దోపిడీ, హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
హత్య అనంతరం ఇంట్లోని బంగారం, విలువైన వస్తువులను ముఠా సభ్యులు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. దోపిడీ చేసిన బంగారాన్ని ముంబైలో దాచినట్లు సమాచారం రావడంతో అక్కడి పోలీసులతో కలిసి ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. కేసు విచారణలో భాగంగా ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి కీలక సమాచారం లభిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ కేసులో ప్రధాన పాత్రధారి అయిన కల్పన పరారీలో ఉండటంతో పోలీసులు ఆమె కోసం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ప్రస్తుతం ఆమె పుణేలో తలదాచుకున్నట్లు సమాచారం రావడంతో అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ గ్యాంగ్‌కు దేశవ్యాప్తంగా పలు నేర కేసులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది.
ఢిల్లీలో జైలులో ఉన్న సాహు గ్యాంగ్ నాయకుడు ఫోన్ కాల్స్, మధ్యవర్తుల ద్వారా ఈ హత్యకు మార్గనిర్దేశం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో జైలు కమ్యూనికేషన్ వ్యవస్థపై కూడా అధికారులు దృష్టి సారించారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతుండగా.. నిందితులందరినీ త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.


