30.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

పవన్ కళ్యాణ్‌ ఎక్కడ తప్పు చేశారు? .. ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారు?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ పెట్టిన సినీ హీరో విజయ్ ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునే స్థాయికి చేరడం జాతీయ రాజకీయాల్లో పెద్ద సంచలనం. సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్థానంపై ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇద్దరికీ కళ్లు చెదిరే క్రేజ్, లక్షలాది మంది అభిమానులు ఉన్నా.. పవన్ కళ్యాణ్ ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారన్న విశ్లేషణలు ఊపందుకుంటున్నాయి. సరైన సమయంలో ఎంట్రీ ఇవ్వకపోవడం, పొత్తుల పేరుతో ఇతర పార్టీలకు మద్దతు ప్రకటించడమే జనసేనాని రాజకీయ ఎదుగుదలకు బ్రేకులు వేసిందా? సొంత సిద్ధాంతం కంటే జగన్‌ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకోవడం వల్లే ఆయన డిప్యూటీ సీఎంగా మిగిలిపోయారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వేసిన తొలి అడుగులే ఆయనను ముఖ్యమంత్రి పీఠానికి దూరం చేశాయన్న వాదన రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. ఒక రాజకీయ పార్టీని స్థాపిస్తున్నప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయ శూన్యతను అంచనా వేయాలి. కానీ పవన్ సరైన సమయంలో రాజకీయ ఎంట్రీ ఇవ్వకపోవడంతో పాటు, పార్టీ పెట్టిన వెంటనే పోటీ చేయకుండా ఇతర పార్టీలకు మద్దతు ప్రకటించడం ఆయన చేసిన తొలి వ్యూహాత్మక తప్పిదంగా విశ్లేషకులు చెబుతున్నారు. 2014లో పార్టీని లాంచ్ చేసిన పవన్, ఆ సార్వత్రిక ఎన్నికల్లో ఏ ఒక్క స్థానంలోనూ పోటీ చేయలేదు. పైగా బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమికి బేషరతుగా తన పూర్తి మద్దతును ప్రకటించారు. తనకంటూ ఒక ఇమేజ్ ఉన్న ప్రారంభ దశలోనే ఇలా వేరొకరి కోసం ప్రచారం చేయడం ద్వారా ఆయన తన స్వంత బలాన్ని, ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని పక్కదారి పట్టించారు. నాడు సొంతంగా బరిలోకి దిగకపోవడం వల్లే ఆయన రాజకీయ ప్రయాణం ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పదవి వరకే పరిమితం కావాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో తమిళనాడు పరిణామాలను చూసి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాల్సింది చాలా ఉందని అభిప్రాయపడుతున్నారు.

తమిళనాడులో దళపతి విజయ్ తన ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీని 2024లో స్థాపించి, కేవలం రెండేళ్ల వ్యవధిలోనే, అంటే 2026 ఎన్నికల్లో ఏకంగా అధికారంలోకి వచ్చే స్థాయికి చేరడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఫలితాల తర్వాత ఏపీలో పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై కూడా తీవ్రస్థాయిలో మేధోమథనం జరుగుతోంది. వాస్తవానికి విజయ్ స్థాయిలోనే పవన్ కళ్యాణ్‌కు కూడా తిరుగులేని చరిష్మా ఉంది. ఆయన పిలుపునిస్తే ప్రాణాలిచ్చే లక్షలాది మంది అభిమానులు ఆయన వెన్నంటే ఉన్నారు. దీనికి తోడు రాష్ట్రంలో అత్యంత బలమైన కాపు సామాజికవర్గం మొత్తం ఆయన వెనక ఒక సైన్యంలా నిలబడింది. ఇదే పవన్‌కు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. ఒకవేళ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగి ఉంటే, ఆ చరిష్మాతో కచ్చితంగా ముఖ్యమంత్రి పదవిని సులువుగా దక్కించుకునే వారన్న బలమైన విశ్లేషణలు ఇప్పుడు వెలువడుతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ ఆ ధైర్యాన్ని ప్రదర్శించలేకపోయారు. తన స్వంత బలాన్ని విశ్వసించకుండా, కేవలం పొత్తులతోనే సరిపెట్టుకోవడం ఆయన పాలిట శాపంగా మారింది.

ఒక రాజకీయ పార్టీగా సొంతంగా ఎదగాలన్న లక్ష్యం కంటే, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలన్న ఏకైక ధ్యేయంతోనే పవన్ కళ్యాణ్ పనిచేశారు. జగన్ వ్యతిరేక ఓటు చీలిపోకూడదన్న పట్టుదలతోనే ఆయన స్వయంగా చొరవ తీసుకుని టీడీపీ, బీజేపీలతో తిరిగి పొత్తులు కుదుర్చుకున్నారు. ఈ యాంటీ జగన్ ఎజెండా వల్ల ఆయన డిప్యూటీ సీఎం పీఠం వరకే ఆగిపోవాల్సి వచ్చింది. సాధారణంగా ఏ రాజకీయ పార్టీకైనా పెట్టిన తొలి నాళ్లలో ప్రజల్లో ఒక విపరీతమైన క్రేజ్, ఇమేజ్ ఉంటాయి. కాలం గడిచేకొద్దీ రాను రాను ఆ ప్రభావం తగ్గుతూ వస్తుంది. ఈ ఫార్ములా పవన్ కైనా, విజయ్ కైనా, మరెవరికైనా ఒకటే. పార్టీ పెట్టిన పదేళ్లలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే ఎన్నో వైరుధ్యాలు కనిపిస్తాయి. తొలి నాళ్లలో బీజేపీ, టీడీపీలను తీవ్ర స్థాయిలో తిట్టిపోశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల నాటికి బీఎస్పీ, వామపక్ష పార్టీలతో కలిసి నడిచారు. తిరిగి తాజా ఎన్నికల్లో మళ్లీ అదే టీడీపీ, బీజేపీలతో జతకట్టారు. ఇలా తరచూ పొత్తులు, విధానాలు మార్చుకోవడం వల్ల తనకంటూ ఒక బలమైన సిద్ధాంతం ఉందని ఆయన ప్రజలను పూర్తిస్థాయిలో నమ్మించలేకపోయారు.

తాజా ఎన్నికల్లో పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో గెలుపొంది వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించామని జనసేన నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే వాస్తవాలను నిశితంగా పరిశీలిస్తే, ఇది కేవలం కూటమి పొత్తుల వల్ల వచ్చిన విజయంగానే పరిగణించలేము. గత ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఫల్య పాలన, జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో గూడుకట్టుకున్న తీవ్రమైన వ్యతిరేకతే ఈ విజయానికి ప్రధాన కారణం అన్నది గ్రహిస్తే మంచిది. ప్రజలు మార్పు కోరుకున్న ఆ చారిత్రక సందర్భాన్ని పవన్ కళ్యాణ్ పూర్తిగా తన సొంత ఖాతాలో వేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఆయన దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు, సమాజంలో మార్పు తీసుకురావాలనుకుంటున్నప్పుడు అన్ని కోణాల్లో నిశితంగా ఆలోచించి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. భావోద్వేగాలతో, కేవలం రాజకీయ శత్రువుపై ఉన్న ఆవేశంతో తీసుకునే తాత్కాలిక నిర్ణయాలు పవన్‌ను ముఖ్యమంత్రి పీఠం దరిదాపులకు కూడా వెళ్లనివ్వకుండా అక్కడి వరకే ఆపివేస్తాయి.

రెండు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రాలను పోల్చి చూసినప్పుడు, ఒక నాయకుడు ఎలా ఉండకూడదో చెప్పడానికి ఇప్పుడు ఏపీలో జనసేన పార్టీ పరిస్థితే ఒక ఉదాహరణగా నిలుస్తోంది. భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ అడుగు ముఖ్యమంత్రి పీఠం వైపు పడాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అత్యంత కష్టసాధ్యమేనని చెప్పాలి. ఎందుకంటే ప్రజలు కూడా ఆయన్ను ఒక మద్దతుదారుడిగానే, ఒక జూనియర్ పార్ట్‌నర్ గానే చూస్తున్నారు తప్ప, ఒక స్వతంత్ర నాయకుడిగా, రాష్ట్రాన్ని ఒంటరిగా నడిపించే ఫుల్ టైమ్ పొలిటీషియన్‌గా అంగీకరించడం లేదు. రాజకీయాల్లో సొంత బలం మీద నమ్మకం, ఒక స్థిరమైన సిద్ధాంతం, సరైన సమయంలో తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలే నాయకుడిని శిఖరాగ్రాన నిలబెడతాయి. ఈ కనీస రాజకీయ సూత్రాన్ని, వ్యూహాన్ని అర్థం చేసుకోని పవన్ కళ్యాణ్.. ఒక సొంత పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రి కావాల్సిన నాయకుడిగా పొలిటికల్ గ్రౌండ్ లో ఫెయిల్ అయినట్లేనన్నది జాతీయ స్థాయి రాజకీయ విశ్లేషకుల పక్కా అంచనా. దళపతి విజయ్ వేసిన పొలిటికల్ స్కెచ్ ఇప్పుడు పవన్ కు ఒక పరోక్ష పాఠంగా మిగిలిపోనుంది.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్