రాళ్లు పడిన చోటే ప్రశంసల పూలవర్షం కురిస్తే, ఆ ఆనందమే వేరు. ఆ ఘనత సాధించింది పాయల్ కపాడియా. ప్రతిష్టాత్మక కేన్స్ గ్రాండ్ ప్రీ అవార్డు గెలుచుకున్న ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ దర్శకురాలు పాయల్ కపాడియాను సాక్షాత్తూ ప్రధాని మోదీ దేశానికే గర్వకారణంగా ప్రశంసిస్తుంటే, ఒకప్పుడు దూరం పెట్టిన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆ ప్రతిభావంతురాలు మా అమ్మాయే.. అని ఆకాశానికి ఎత్తేస్తోంది. ఆ చోద్యం చూద్దాం.
పాయల్ కపాడియా సాధించిన విజయంలో తమకూ భాగస్వామ్యం ఉందని క్లైమ్ చేసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం, ఎఫ్టి ఐఐ చేసిన ప్రయత్నాలు సినీ రంగ ప్రముఖులనే ఆశ్చర్యపరుస్తున్నాయి. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రతిష్ఠాత్మక గ్రాండ్ ప్రిని గెలుచుకున్న తొలి భారతీయురాలిగా పాయల్ కపాడియా చరిత్ర సృష్టించారు. అది జరిగిన కొన్ని గంటల్లోనే ఎఫ్ టీఐఐ పాయల్ తమ ఆధ్వర్యంలో ఎదిగిన దర్శ కురాలని సగర్వంగా ఓ ప్రకటన విడుదల చేసింది. పాయల్ చారిత్రాత్మక విజయాన్ని చూసి భారత దేశం గర్విస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించగా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ “ఎఫ్ టిఐఐ పూర్వ విద్యార్థిని”ని ప్రత్యేకంగా అభినందించారు,
పాయల్ కపాడియా చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహ నిర్మాతగా , ఫిల్మ్ ఇన్సెంటివ్ స్కీమ్ మద్దతు తో నిర్మింప బడిందని పేర్కొన్నారు. ఈ చిత్రం భారతదేశం, ఫ్రాన్స్ సంయుక్త నిర్మాణం. సహ-నిర్మాతగా భారతదేశం 30% ఆర్థిక సహకారం అందించింది. అంత మాత్రాన ఆమె విజయంలో తన పాత్ర ఉందని బీజేపి సర్కార్ చెప్పుకునే ప్రయత్నం చేయడమే విచిత్రం. పాయల్ కపాడియా ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ డాక్యుమెంటరీ గోల్డ్ ఐ గెలుచుకుంది. 2021లో ఆమె నిర్మించిన ఓ నైట్ ఆర్ నోయింగ్ నథింగ్ కూడా గోల్డెన్ ఐ అవార్డుకు సమానమైన పామ్ డి అవార్డు గెలుచుకుంది. అప్పట్లో బీజేపీ, ఎఫ్ టిఐఐ రియాక్షన్ కు ఇప్పటి ప్రశంసలతో పోల్చి చూస్తే.. అసలు విషయం అర్థమవుతుంది. 2015లో టెలివిజన్ నటుడు మహాభారతంలో ధర్మరాజు పాత్రధారి గజేంద్ర చౌహాన్ ను బీజేపీ సర్కార్ ఎఫ్ టీఐఐ చీఫ్ గా నియమించడంతో ఇనిస్టిట్యూట్ విద్యార్థులు నిరసన తెలిపారు. ఆ నిరసనలకు పాయల్ నాయకత్వం వహించడంతో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ క్రమశిక్షణ తీసుకోవ డమే కాదు. ఆమెకు గ్రాంట్ ను తొలగించి వేధింపులకు గురిచేసింది. ఎఫ్ టీఐఐ పెట్టిన కేసు ఇంకా నడుస్తోంది. ఆ కేసులో వచ్చేనెల పాయల్ కోర్టుకు హాజరు కావల్సి ఉంది కూడా. అలాంటి నేపథ్యంలో ప్రస్తుతం ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ పాయల్ కపాడియా విజయం మా ఘనతే అని చెప్పుకునేం దుకు .. అటు ఎఫ్ టీఐఐ, ఇటు బిజేపీ ప్రభుత్వం తంటాలు పడడం నిజంగా ఆశ్చర్య కరమే. .
నిజానికి విద్యార్థుల నిరసన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ వంటి సంస్థలు వ్యవస్థలపై రాజకీయ నియామకా లపైనే. అయితే గజేంద్ర చౌహాన్ ను నియామకాన్ని కాదన్న వారిని యాంటీ హిందూ అనో దేశద్రోహి అనో ముద్ర వేయడాన్ని అప్పట్లో విద్యార్థులు జీర్ణించుకోలేపోయారు. ఈ నిరసనోద్యమాన్ని ఓ నైట్ ఆర్ నోయింగ్ నథింగ్ డాక్యుమెంటరీలో చూపించారు. 2020 జనవరిలో ఎస్ఎఫ్ఐ నాయకురాలు ఐషే ఘోష్, ఇతర జేఎన్యూ విద్యార్థులపై ఏబీవీపీ విద్యార్థులు జరిపిన దాడుల భయానక స్వభావాన్ని కూడా ‘ఎ నైట్ ఆర్ నోయింగ్ నథింగ్’ ప్రస్తావించింది. ఒక సన్నివేశంలో బిజెపి ప్రవేశపెట్టిన వివాదాస్పద జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా నిరసన కనిపిస్తుంది. అందువల్లనే ఆ డాక్యూమెంటరీకి గౌరవం దక్కి నప్పుడు ఎఫ్ టీఐఐ కానీ, బీజేపీ సర్కార్ కానీ, ఎలాంటి ప్రశంస చేయలేదు. కానీ ఇప్పుడు కేన్స్ గ్రాండ్ ప్రీ అవార్డు రాగానే, అదే పాయల్ కపాడియా పై ప్రశంసల వర్షం కురిసింది. అదే చోద్యం.


