23.2 C
Hyderabad
Wednesday, February 4, 2026
spot_img

ముస్లిం మైనారిటీలపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే , యావత్ ప్రజల సంపదను ముస్లిం మైనారిటీలకు దోచిపెడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.

    ఈ నేపథ్యంలో  హిందూ మహిళల మంగళసూత్రాలను కూడా కాంగ్రెస్ సర్కార్ లాక్కుంటుందని ఆయన వ్యాఖ్యనించారు. ముస్లిం మైనారిటీలను టార్గెట్‌ చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపాయి. అంతేకాదు తన వాదనకు మద్దతుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలను నరేంద్ర మోడీ ఉదహరించారు. వాస్తవానికి మన్మోహన్ సింగ్ అన్నది వేరు. దేశ సంపదపై ఇతర సామాజికవర్గాలతో పాటు దళితులు, ఆదివాసీలు, ముస్లిం మైనారిటీలకు కూడా సమాన హక్కులు ఉన్నాయని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఇది దాదాపు పదేళ్ల కిందటి ముచ్చట. కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం రెండో టర్మ్‌లో ఉన్నప్పుడు ఒక అధికారిక కార్యక్రమంలో మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ అన్నమాట. అగ్రవర్ణాలతో పాటు సమాజంలోని బడుగు, బలహీనవర్గాలు, ముస్లిం మైనారిటీలకు కూడా దేశ సంపదపై సమాన హక్కులున్నాయని చెబుతూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్య అది. అయితే మన్మోహన్ సింగ్ సుదీర్ఘ ప్రసంగంలో దళితులు, ఆదివాసీలు గురించి మాట్లాడిన మాటలను కట్ చేసి కేవలం ముస్లిం మైనారిటీల ప్రస్తావన వచ్చినప్పుడు మాట్లాడిన మాటలనే లక్ష్యంగా చేసుకున్నారు ప్రధాన నరేంద్ర మోడీ.

రాజస్థాన్ ఎన్నికల ప్రచారసభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసింది నూటికి నూరు శాతం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యల వక్రీకరణే. ఇందులో రెండో అభిప్రాయమే లేదు. ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ముస్లిం మైనారిటీల గురించి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. అప్పటివరకు ముస్లింల గురించి పలువురు బీజేపీ నాయకులు మాట్లాడారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఏనాడూ ఓపెన్‌గా ముస్లిం మైనారిటీలను ఉద్దేశించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేశాయి. తొలిదశ పోలింగ్ తరువాత బీజేపీకి స్వంతంగా 370 సీట్లు రావడం అంత సులభం కాదన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.దీంతో ముస్లిం వ్యతిరేకతను అడ్డం పెట్టుకుని ఎన్నికల వైతరణి దాటాలన్నది ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహంలా కనిపిస్తోంది. హిందూ -ముస్లిం పోలరైజేషన్‌ను దృష్టిలో పెట్టుకునే నరేంద్ర మోడీ వ్యాఖ్యానించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. నాయకులంటే సమాజానికి ఆదర్శంగా ఉండాలి. అలాంటి నాయకులే గాడి తప్పి ప్రసంగాలు చేయడం దురదృష్టకరం. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ వైఖరి మరింతగా పెరిగింది. మైక్ పట్టుకోగానే, ఏం మాట్లాడుతున్నామన్న సోయ కోల్పోతున్నారు. ఈ బాపతు నేతలు అన్ని పార్టీల్లోనూ ఉంటారు. అయితే కమలనాథులు ముందు వరుసలో ఉంటారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన నేతలే ఎన్నికల సమయం రాగానే సమాజంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం మనం చూస్తున్నాం.

గౌహతిలో కూరగాయల ధరలు పెరగడానికి మియాలే కారణమని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కొన్ని నెలల కిందట సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ మియాలంటే బంగ్లా నుంచి వలస వచ్చిన బెంగాలీ మాట్లాడే ముస్లింలు. గౌహతి నగర ఫుట్‌పాత్‌లపై కూర్చుని బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింలు కూరగాయలను అధిక రేట్లకు అమ్ముతున్నారనేది హిమంత బిశ్వ శర్మ ఆరోపణ. దీంతో కూరగాయలు అమ్ముకునే ఫుట్‌పాత్‌ల నుంచి ముస్లింలను వెళ్లగొడతానన్నారు. కూరగాయలు అమ్మేది బెంగాలీ ముస్లింలు కాకుండా అసోం హిందువులు అయితే ఇలా దోపిడీ చేసేవారు కాదన్నది బిశ్వ శర్మ కవి హృదయం. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి విగ్నత మరచిపోయి ముస్లిం మైనారిటీలను కించపరిచేలా దిగజారి మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరచింది. బెంగాలీ ముస్లింల పట్ల అసోం సమాజంలో విద్వేష బీజాలు నాటడమే హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యల వెనుక ఉన్న ప్రధానోద్దేశం అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సర్కార్ నిర్దేశించిన ధరలు కంటే కూరగాయలు కాదు కదా ఏ వస్తువునైనా ఎక్కువ రేట్లకు ఎవరు అమ్మినా చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వ యంత్రాంగం ఉన్నదే ఈ పని చేయడానికే. ఇందులో కూరగాయల వ్యాపారులు హిందువులా ? ముస్లింలా? క్రైస్తవులా అనేది అప్రస్తుతం. కూరగాయల వ్యాపారానికి మతానికి సంబంధ ఏమిటో ఇప్పటివరకు హిమంత బిశ్వ శర్మ వివరించలేదు.

ఇటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు హిమంత బిశ్వ శర్మతో ప్రారంభం కాలేదు. అలా అని ఆయనతో ముగియదు కూడా. గతంలో కూడా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న అనేక మంది రాజకీయ నాయకులు సమాజంలో విషం చిమ్మే ప్రసంగాలు చేశారు. తమ మాటలతో సమాజాన్ని చీల్చే ప్రయత్నాలు చేశారు. బీజేపీ నేత నూపుర్ శర్మ 2022 జూన్ నెలలో చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపాయి. బీజేపీ అధికార ప్రతినిధి హోదాలో ఒక టీవీ ఛానెల్ చర్చా గోష్టికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చలో భాగంగా మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. నూపుర్ శర్మ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నూపుర్ శర్మ వ్యాఖ్యల నేపథ్యంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. నూపుర్ శర్మ కామెంట్స్ మనదేశంలోనే కాదు, అంతర్జాతీయంగానూ దుమారం రేపాయి. ముఖ్యంగా ఖతర్, మలేషియా, సౌదీ అరేబియా, ఇరాన్ వంటి అనేక ముస్లిం దేశాలు భారత్‌ను వేలెత్తి చూపాయి. అనేక ముస్లిం దేశాలతో భారత్‌కు వాణిజ్య సంబంధాలున్నాయి. దీంతో భారతదేశం వెంటనే అప్రమత్తమైంది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా నూపుర్ శర్మను సస్పెండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంది . విషం చిమ్మే ప్రసంగాలు చేసిన నాయకుల జాబితాలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఉన్నారు. 2020 జనవరిలో ఢిల్లీలోని ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ముస్లిం మైనారిటీలపై ఆయన విషం చిమ్మారు. ముస్లింలను దేశ ద్రోహులంటూ ఘాటు ఆరోపణలు చేశారు. దేశ్ కే గద్దారోంకో గోలీ మారో అంటూ ఒక వర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ సీనియర్ నేత పర్వేష్ వర్మ కు కూడా ముస్లిం సమాజంపై విషం చిమ్ముతూ కామెంట్స్ చేసిన చరిత్ర ఉంది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రసంగిస్తూ ముస్లింలపై ఆయన దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అప్పటికే ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి గందరగోళంగా ఉంది. పర్వేష్‌ వర్మ కామెంట్లతో వాతావరణం మరింతగా హీటెక్కింది. ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక సంఘటనలు జరిగాయి. మొత్తంమీద కొంతమంది బీజేపీ నేతలు అవకాశం దొరికినప్పుడల్లా విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూనే ఉన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్