తీవ్ర సంకటస్థితిలో బీఆర్‌ఎస్

    తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితి ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు గులాబీ పార్టీకి అగ్నిపరీక్షగా మారాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ రాష్ట్ర సమితి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అటు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మధ్య తీవ్ర పోరు నెలకొంది. తెలంగాణలో అధికారంలో ఉండటంతో మొత్తం 17 నియోజక వర్గాల్లో మెజారిటీ సెగ్మెంట్లు గెలుచుకోవాలని నిర్ణయించుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి విషయాల్లో సహజంగా ముఖ్యమంత్రిపైనే బాధ్యత పెడుతుంటుంది కాంగ్రెస్ అధిష్టానం. ఈసారి కూడా ఎప్పటిలాగే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై మెజారిటీ సీట్లు గెలుచుకునే బాధ్యత పెట్టింది హై కమాండ్. దీంతో నాలుగు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడి హోదాలో సత్తా చాటిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో తన చాతుర్యం ప్రదర్శించడానికి సన్నద్ధమయ్యారు. సహజంగా అధికారంలో ఉన్న పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులోని తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఆర్నెల్లు కూడా కాలేదు. రేవంత్ సర్కార్‌పై చెప్పుకోదగ్గ ప్రతికూలత కూడా లేదు. పైపెచ్చు ఈ నాలుగు నెలల కాలంలో ప్రజలకు ఉపయోగపడే అనేక పనులకు శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం సూపర్ డూపర్‌గా హిట్ అయింది. ఆధార్ కార్డు చూపించి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు తెలంగాణ ఆడ పడచులు.

కొన్ని రోజుల కిందట ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలపై ఆరా తీశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపారు. ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. మొత్తం 17 నియోజక వర్గాల్లో 15 సెగ్మెంట్లను టార్గెట్‌గా ఫిక్స్ చేశారు కేసీ వేణుగోపాల్. అంతేకాదు…తెలంగాణ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇటీవల ప్రత్యేకంగా మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది హస్తం పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఇప్పటికి పదేళ్లు అవుతోంది. విభజన సందర్భంగా తెలంగాణకు అనేక హామీలు ఇచ్చింది అప్పటి యూపీఏ ప్రభుత్వం. అయితే కేంద్రంలో పదేళ్ల పాటు ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్నప్పటికీ విభజన హామీలు అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో విభజన హామీలలోని ప్రధాన అంశాలను ప్రత్యేక మేనిఫెస్టోలో చేర్చింది హస్తం పార్టీ.

మరోవైపు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కూడా దూకుడు మీద ఉంది. మొత్తం 17 నియోజకవర్గాలను టార్గెట్‌గా పెట్టుకుంది.సారాకే సారా సత్రా హమారా నినాదంతో జనంలోకి దూసుకెళు తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సహా అనేక మంది బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో విస్తృతంగా పర్యటించారు. పదేళ్ల కేసీఆర్ పాలనను అలాగే నాలుగు నెలల రేవంత్ రెడ్డి పాలనను టార్గెట్‌ చేసుకుని ప్రచారంలోకి దూసుకెళుతోంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణ వెనుకబాటుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలే కారణమంటూ ప్రచారాన్ని హెరెత్తిస్తున్నారు కమలనాథులు. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత గులాబీ పార్టీలో పరిస్థితులు తారుమారయ్యాయి. తెలంగాణలో ఓటమిని బీఆర్ఎస్ ఏమాత్రం ఊహించలేదు. కచ్చితంగా తాము హ్యాట్రిక్ కొడతామనుకున్న కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై కూడా దృష్టి పెట్టారు. అందుకోసం టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ గా ముందుకెళ్లారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ పేరుతో కూటమి కట్టడానికి దేశవ్యాప్తంగా వివిధ పార్టీల అధినేతలతో చర్చలు జరిపారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఒక్కొక్కరుగా నాయకులు గులాబీ పార్టీని వీడటం మొదలైంది. మరోవైపు గేట్లు ఓపెన్ చేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటన చేయడంతో వలసలు జోరయ్యాయి. వరంగల్ నియోజకవర్గానికి కడియం కావ్యకు బీఫామ్ ఇస్తే చివరిక్షణంలో పోటీ చేసేది లేదంటూ యూ టర్న్ తీసుకుంది కావ్య. చివరకు కాంగ్రెస్ టికెట్‌పై అదే వరంగల్ నియోజకవర్గం నుంచి బరిలో నిల్చుంది. ఇటువంటి పరిస్థితి వస్తుందని గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నడూ ఊహించి ఉండరు. ఏమైనా ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు తెచ్చుకోకుంటే …బీఆర్‌ఎస్ ఉనికే డేంజర్‌ జోన్‌లో పడే ప్రమాదం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్