పశ్చిమ బెంగాల్ లో 2024 లోక్ సభ ఎన్నికలు మోదీ నియంతృత్వ పోకడలకు, మమతా బెనర్జీ అహంకార ధోరణుల మధ్య పోరాటం కానుంది. 33 ఏళ్లు అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ లను చిత్తుచేసిన తాను బీజేపీ ని కూడా ఒంటిచేత్తో ఎదుర్కొంటానన్న ధీమాతో మమతా బెనర్జీ ఇండియా కూటమికి గుడ్ బై చెప్పి ఒంటరి పోరుకు సిద్ధమైంది. స్కామ్ లు, అరాచక విధానాలు, ప్రభుత్వ వ్యతిరేకతతో గందరగోళ పరిస్థితి నెలకొంది. టీఎంసీ 42, బీజేపీ 40, లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ కూటమి 30 సీట్లకు పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ అటు బీజేపీ, ఇటు కమ్యూనిస్ట్- కాంగ్రెస్ లను, మరోపక్క ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ను ఎదిరించి ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.
పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకి ఈ సారి పార్లమెంటు ఎన్నికలు నల్లేరుపైనడక కాదు. 2019లో 22 నియోజకవర్గా ల్లో నెగ్గిన తృణమూల్ కాంగ్రెస్ ఈ సారి సగం స్థానాలైన నెగ్గుతుందా అన్నది అనుమానమే. వరుస స్కామ్ లు, స్కామ్ లలో చిక్కినవారిని రక్షించే వైఖరి, నార్త్ 24 పరగణాల జిల్లా సందేశ్ ఖలీలో భూకబ్జాలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డ షాజహాన్ షేక్ ను రక్షించేందుకు చేసిన యత్నాలు, ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత తెచ్చిపెట్టాయి. అతడి ని టీఎంసీ నుంచి బహిష్కరించినా.. పార్టీపై ప్రజా గ్రహం తగ్గలేదు. 2019లో పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ 22, బీజేపీ 18, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకున్నాయి. కమ్యూనిస్ట్ లకు ఒక్క సీటు దక్కలేదు.
2024 లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బంగాల్ లోని 42 సీట్లకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకూ ఏడు దశల్లోనూ ఎన్నికలు జరుగుతాయి. అలాగే భగబంగోలా, బారా నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు మే7న, జూన్ 1న ఉపఎన్నికలు జరుగు తాయి. ఎంపీ ఎన్నికలు తొలిదశలో ఏప్రిల్ 19న కూచ్ బెహర్, అలీపు ర్దువార్స్, జల్పాయిగురి స్థానాలకు జరుగుతాయి. ఏప్రిల్ 26న డార్జిలింగ్, రాయ్ గంజ్, బాలూర్ ఘాట్, స్థానాలకు, మే 7న మూడో దశలో మాల్దా ఉత్తర్, మాల్దా దక్షిణ్, జంగిపూర్, ముర్షిదాబాద్ నియోజకవ ర్గాలకు పోలింగ్ జరుగుతుంది. నాల్గోదశలో మే 13న బహరాంపూర్, కృష్ణానగర్, రాణాఘాట్, బర్ధమాన్ పుర్బా, బుర్ద్వాన్-దుర్గాపూర్, అసన్సోల్, బోల్పూర్, బీర్భూమ్ స్థానాలకు పోలింగ్. ఐదో దశలో మే 20న బంగావ్, బరాక్పూర్, హౌరా, ఉలుబేరియా, శ్రీరాంపూర్, హుగ్లీ, ఆరాంబాగ్ నియోజకవర్గాలకు పోలింగ్. మే 26న ఆరోదశలో తుమ్లుక్ , కాంతి, ఘటాల్, ఝుర్ గామ్, మేదినీ పూర్, పురూలియా, బంకూరా, బిష్ణుపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. జూన్ 1న చివరి దశలో డమ్ డమ్, బరాసత్, బసిర్హాట్, జయనగర్, మధురాపూర్, డైమండ్ హార్బర్, జాదవ్ పూర్, కోల్కతా దక్షిణ్, కోల్కతా ఉత్తర నియోజకవర్గాలకు పోలింగ్ తో ఎన్నికలు పూర్తి.
పశ్చిమ బెంగాల్ లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాన అంశాలు పౌరసత్వం సవరణ చట్టం, జూట్ మిల్లు కార్మికులు, జూట్ సాగు రైతుల సమస్యలు, ధరల పెరుగుదల, ఇతర సమస్యలు. లక్షలాది మందికి ఉపాధి కల్పించిన జూట్ మిల్లులు, జూట్ సాగు రైతులు ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొం టున్నారు. వారి ఓట్లను ఆకట్టుకునేందుకు అటు టీఎం సీ, ఇటు బీజేపీ తంటాలు పడుతున్నా యి. ఇక బెంగాల్ లో.. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసలు, మయన్మార్ నుంచి రోహిగ్యాల వలసలు ఎక్కువే. వీరిలో బంగ్లానుంచి వచ్చిన వారందరికీ ఆధార్, రేషన్ కార్డులు ఇచ్చేసి, ఓటర్లలో చేర్పించి లబ్ధి పొందు తోందనే ఆరోపణ టీఎంసీపై ఉంది. మమత పార్టీ సీఏఏ వ్యతిరేకించడానికి ఇదీ ఓ కారణమే. ఇటీవల కాలంలో పెరిగిపోతున్న శాంతి భద్రతల సమస్య పట్ల సామాన్య జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మమతా బెనర్జీ పరిస్థితిని అదుపు చేయలేయడం లేదని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ, కమ్యూనిస్ట్ లు దుమ్మత్తి పోతున్నారు. టీఎంసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమిలో చేరినా..సీట్ల పంపిణీకి వచ్చేటప్పడికి ససేమిరా అంది. మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. లోక్ సభలో ప్రతి పక్షనేత అధిర్ రంజన్ చౌదరీపై క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ను పోటీ పెట్టడం విశేషం.
ఒకప్పడు సింగిల్ డిజిట్ కే పరిమితమైన బీజేపీ మోదీ చరిష్మా పుణ్యమా అని బలపడింది. దాదాపు అన్ని సీట్లలోనూ పోటీ చేసే స్థితికి చేరింది. సీఏఏ తమకు అనుకూలించే అంశం కాగలదని బీజేపీ భావిస్తోంది. హిందుత్వ ఎజెండా బెంగాల్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ సాధించింది.ఇక టీఎంసీకి గట్టి పోటీ ఇస్తోంది. ఇక మమతా బెనర్జీ మాత్రం వెనక్కి తగ్గేదేలే.. అన్నట్లు గానే సాగుతున్నారు. విస్తృతంగా ప్రచారం చేస్తూ, తన ముఖం గుర్తుంచుకుని, టీఎంసీ అభ్యర్థులందరికీ ఓటు వేయాలని పిలుపుని చ్చారు. లోక్ సభ సభ్యత్వం నుంచి బహిష్కరణ పొందిన మహువా మొయిత్రాకే కృష్ణానగర్ సీటు ఇచ్చారు. ఆమెను గెలిపించాల్సిందిగా కోరారు. సీపీఐ,సీపీఎం, కాంగ్రెస్ కూటమిగా కొన్నిసీట్లకే పరిమిత మయ్యాయి. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పేరుతో ముస్లింలు ప్రత్యేకగా 42 సీట్లకు పోటీ పడుతున్నారు. దీంతో పలు చోట్ల త్రిముఖ పోటీలు, చతుత్ముఖ పోటీలు జరిగే అవకాశం ఉంది. విజేత లెవరో జూన్ 4న తేలు తుంది.


