వైఎస్ VS వైఎస్..ఈసారి కడప గడపలో అసలు సిసలైన సంగ్రామం జరగబోతోంది. ఏ కుటుంబానికైతే కడప జిల్లా ప్రజలు అండగా నిలబడ్డారో.. అదే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు ప్రత్యర్థులుగా బరిలో నిలవనున్నారు. ఓ వైపు సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి..మరోవైపు ఏపీసీసీ చీఫ్‌గా ఉన్న వైఎస్ షర్మిల నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. అయితే ఈ ఉత్కంఠ పోరులో వివేకా హత్య అంశం కీలకంగా మారనుంది. వివేకా హత్య చేయించింది అవినాష్‌రెడ్డే అని షర్మిల బల్లగుద్ది చెప్పడం.. ఇందుకు వివేకా కుమార్తె సునీత తోడవడం అగ్నికి ఆజ్యం పోసింది. దీంతో కడప గడపలో గెలిచి నిలిచేది ఎవరనే చర్చ తెరపైకి వచ్చింది..
ఏపీ ఎన్నికలు ఈసారి తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోవడంతో ఈ సారి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి నెలకొంది. అధికార వైసీపీ ఒంటరి పోరుకు సిద్ధమవుతుంటే.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల బరిలో దిగనున్నాయి. మరోవైపు గత ఎన్నికల తర్వాత అసలు జెండా మోసే వారే లేరనుకున్న కాంగ్రెస్ పార్టీ, ఈసారి అధికార వైసీపీతో ఢీ అంటే ఢీ అంటూ ముందుకొచ్చింది. అంతేకాదు ఈసారి కడప గడపలో YSR కుటుంబ సభ్యుల మధ్య హైఓల్టేజ్ వార్ జరగనుంది. ఇప్పటికే వైసీపీ తరపున కడప అభ్యర్ధిగా సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిపేరును ప్రకటించారు జగన్. అయితే ఆయనకు ప్రత్యర్ధిగా.. కాంగ్రెస్ అభ్యర్ధి గా ఏపీసీసీ చీఫ్ YSషర్మిలను బరిలోకి దింపుతోంది ఆ పార్టీ హైకమాండ్. దీంతో వైఎస్ కుటంబ సభ్యుల మధ్య పోరు రసవత్తరంగా మారనుందంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన షర్మిల.. ఎంపీ అవినాష్ రెడ్డి టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే షర్మిలతో పాటు సునీత కూడా తోడవడంతో వైసీపీ శిబిరం ఉక్కిరి బిక్కిరి అవుతు న్నట్లు కనిపిస్తోంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని లేవనెత్తుతూ.. తన పోటీకి ప్రధాన కారణం బాబాయి హత్యేనని షర్మిల ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తనను ఎంపీ చేయాలని వివేకానంద రెడ్డి పరితపించారని.. అప్పట్లో తాను ఆ విషయాన్ని పట్టించుకోలేదని.. ఆయన హత్య జరిగిన తరువాత తనకు అర్థమైందని షర్మిల చెప్పుకొచ్చారు. హత్యా రాజకీయాలకు ముగింపు పలకా లంటే జగన్, అవినాశ్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. అంతే కాదు జగన్ హత్య రాజకీయాలను ప్రోత్సహించారని ఆలస్యంగా తెలుసుకున్నానని..వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారికే మరోసారి ఎంపీ టికెట్ ఇవ్వడం వల్లే తాను పోటీ చేయాల్సి వచ్చిందని షర్మిల ప్రకటించడం రాజకీయవర్గాల్లో ప్రకంప నలు రేపుతోంది. మరోవైపు షర్మిల తరపున కడప గడపలో వైఎస్ సునీత కూడా ప్రచారం చేస్తు న్నారు. వైఎస్ షర్మిలను ఎంపీ చేయాలనితన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి ఎంతగానో తాపత్రయ పడ్డారని ఆమె చెప్పారు. రాజకీయాల కోసమే తన తండ్రిని క్రూరంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య చేయించిన అవినాష్ రెడ్డే మళ్లీ ఎంపీగా పోటీ చేస్తున్నారని..ఆయనను ఓడించాలని పిలుపునిచ్చారు. పదవుల కోసం తమ్ముణ్ని చంపితే చూసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తట్టుకొనేవారా అని సునీత ప్రశ్నించడం కూడా వైసీపీకి డ్యామేజ్ చేస్తుందని అంటున్నారు.
సరిగ్గా ఇటువంటి సమయంలోనే షర్మిల వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని అజెండాగా తీసుకొని ఎన్నికల పోటీలో దిగారు. కడపలో రాజకీయాలకు అతీతంగా వైయస్ కుటుంబ అభిమానులు అధికంగా ఉంటారు. అయితే ఎంపీ పదవి కోసమే వివేకను దారుణంగా హత్య చేశారన్న ఆరోపణను ఇంతకాలం నమ్మలేదు. కానీ అదే కుటుంబంలో బాధితులు, జగన్ స్వయానా సోదరి షర్మిల కుండ బద్దలు కొట్టి చెబుతుండడం, అటు సిబిఐ సైతం నిందితులను ప్రకటించడం వంటి అంశాలు ఎన్నికల్లో బలంగా పనిచేయనున్నాయి. దీంతో పాటు బాబాయిని హత్య చేసిన వారిని జగన్ కాపాడుతున్నారని.. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత మారిపోయారని స్వయానా షర్మిలనే విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి కడప గడపలో ఇద్దరు చెల్లెళ్లు రంగంలోకి దిగి వివేకా హత్య కేసును ప్రధానంగా లేవనెత్తడంతో వైసీపీకి గట్టి దెబ్బ తగలడమే కాదు.. సోదరి చేతిలో చిత్తు అవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈసారి ఎన్నికల్లో కడప గడపలో ఎవరు గెలుస్తారు..? ప్రజలు ఎవరివైపు ఉన్నారు..? వివేకా హత్య అనంతర పరిణామాలు వైసీపీని దెబ్బతీ స్తాయా…. అన్నది తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి.


