33.3 C
Hyderabad
Sunday, March 1, 2026
spot_img

ఏపీ రాజకీయాల్లో పొత్తులు …ఎత్తులు

     ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వేళ.. అధికార, విపక్షాల ఎత్తులు, వ్యూహాలు.. అందరిలోనూ ఉత్కంఠ, అంతకుమించిన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 2019 మాదిరిగానే వైసీపీ ఒంటరిగా ఎన్నికల గోదాలో దిగుతోంది. ఇక, గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవిచూసిన విపక్షాలు.. ఇప్పుడు కలిసి కట్టుగా రంగంలో దిగుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా… అధికార వైసీపీని ఎదుర్కోబోతున్నాయి. మరి.. ఇలాంటి పరిస్థితుల్లో ఏయే అంశాలు కీలకంగా మారబో తున్నాయి.. ? ప్రత్యేకించి ఇటీవలి కాలంలో ఎక్కువగా చర్చ జరుగుతున్నట్లుగా కాపులు ఎటు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది ?

    నువ్వా-నేనా అన్నట్లుగా సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, విపక్ష పార్టీలు. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా బరిలో దిగుతున్నాయి. 2019లో ఎన్నికల్లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకు నేందుకు, ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి విపక్ష పార్టీలు.

     అధికార పార్టీ విషయానికి వస్తే.. వైనాట్ 175 అనే నినాదంతో ఏపీ ప్రజల ముందుకెళుతోంది. రెండేళ్ల ముందు నుంచే ఎన్నికల కోసం వ్వూహాలు రచించడం మొదలుపెట్టిన వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్.. అభ్యర్థుల ఖరారు ప్రక్రియను దాదాపుగా పూర్తి చేశారు. అంతేకాదు.. కొద్ది రోజుల ముందు నుంచే సిద్ధం పేరుతో అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి.. కేడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు. ఎన్నికల వేళ వారికి దిశానిర్దేశం చేయడంతోపాటు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి. ఎన్నికల్లో విపక్షాల పొత్తులపైనా సెటైర్లు వేశారు సీఎం జగన్. తాను ప్రజలను గెలిపించాలని ప్రయత్నిస్తుంటే.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి తనని ఓడిం చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు. రానున్న ఎన్నికలు విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్నాయని, ఈ విషయంలో ప్రజలే ఏది కావాలో తేల్చుకోవాలని ఎక్కడికక్కడ చెప్పు కొస్తున్నారు. మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారని ఆరోపించారు సీఎం జగన్.

     2019 ఎన్నికలు నేర్పిన పాఠాలతో విపక్షాలు మళ్లీ కలిసి కట్టుగా బరిలో దిగుతున్నాయి. ఏపీ సీఎం జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా జట్టు కట్టిన ప్రతిపక్ష పార్టీలు.. ప్రస్తుతం సీట్ల సర్థుబాటుపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా ఎవరు ఏయే స్థానాల నుంచి బరిలో దిగాలన్న దానిపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలంతా సమావేశమై చర్చలు జరుపుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఈ సీట్ల సర్థుబాటు ప్రక్రియ పూర్తి చేసి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని భావిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా సాగితే అతి త్వరలోనే ప్రధాని మోడీ షెడ్యూలు బట్టి చిలకలూరిపేటలో సభ నిర్వహించనున్నారు. ఆ సభ వేదికగా కీలక ప్రకటనలు ఉండే అవకాశాలున్నాయి. అక్కడ్నుంచే మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నాయి. అటు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం తన వంతు పాత్ర పోషిస్తున్నారు. శంఖారావం పేరుతో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తున్న ఆయన.. ఎక్కడికక్కడ వైసీపీ సర్కారుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో చెబుతూ ముందుకు సాగుతున్నారాయన.

    ఇక, 2014 మాదిరిగా పొత్తులు ఖరారైన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పలు అంశాలు కీలకం కాబోతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా, రాజధాని అంశం, పోలవరం నిర్మాణంతోపాటు ఇతరత్రా విభజన హామీల అమలు ప్రచార పర్వంలో విన్పించబోతున్నాయి. ఇక, సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా ఇటీవల కాపుల అంశం ఎక్కువగా తెరపైకి వస్తోంది. కొద్ది రోజుల కిందటే పవన్ కళ్యాణ్.. తనకు ఎవరి సలహాలు అక్కర్లేదంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించన నేపథ్యంలో.. కాపుల్లో అగ్రగణ్యులుగా పిలిచే హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం వైసీపీకి దగ్గరయ్యారు. ముద్రగడ కుటుంబం సహా ఆయన సన్నిహితులు పలువురు ఈనెల 14న వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు అధికారికంగానే ప్రకటించారు ముద్రగడ. ఓవైపు హరిరామ జోగయ్య, మరోవైపు.. ముద్రగడ ఇద్దరూ వైసీపీకి దగ్గర కావడం ఆ పార్టీకి కచ్చితంగా లాభం చేకూర్చేదేనన్న వాదన విన్పిస్తోంది. అయితే.. ఏ మేరకు అధికార పార్టీకి ఇది లాభం కలిగిస్తుంది అన్నది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్