సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా హీరో కొడుకు హీరో అవడానికే ప్రయత్నిస్తుంటాడు. అయితే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కుమారుడు మాత్రం ఇందుకు భిన్నంగా దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
భారీ బడ్జెట్ సినిమాలను రూపొందిస్తూ ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను అందిస్తూ నిర్మాణ సంస్థగా, డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంస్థ లైకా ప్రొడక్షన్స్. స్టార్ హీరోలు, దర్శకులతో పాటు యంగ్ టాలెంట్‌ను కూడా ఎంకరేజ్ చేస్తూ వరుస సినిమాలను రూపొందిస్తోంది. ఈ క్రమంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ విజయ్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కొత్త సినిమాను చేయబోతున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ మాట్లాడుతూ ‘‘సరికొత్త ఆలోచనలతో ఉన్న యంగ్ టాలెంటెడ్ పర్సన్స్ ఎప్పుడూ గేమ్ చేంజర్స్‌గా ఉంటారని లైకా ప్రొడక్షన్స్ నమ్ముతుంది. మా బ్యానర్లో నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను జాసన్ సంజయ్ విజయ్ డైరెక్ట్ చేయబోతున్నారనే విషయాన్ని తెలియజేయటానికి సంతోషిస్తున్నాను. తను చెప్పిన యూనిక్ పాయింట్ నచ్చింది. అలాగే సంజయ్ లండన్‌లో స్క్రీన్ రైటింగ్‌లో బీఏ (హానర్స్)ను పూర్తి చేశారు. అలాగే టోరంటో ఫిల్మ్ స్కూల్లో ఫిల్మ్ ప్రొడక్షన్ డిప్లొమోను కంప్లీట్ చేశారు. తను మా టీమ్‌కి స్క్రిప్ట్ వివరించినప్పుడు మాకెంతో సంతృప్తికరంగా అనిపించింది. తను స్క్రీన్ రైటింగ్, డైరెక్షన్లో స్పెషలైజేషన్ కోర్సులను చేయటం చాలా గొప్ప విషయం. తనకు సినిమా నిర్మాణంపై పూర్తి అవగాహన ఉంది. ప్రతీ ఫిల్మ్ మేకర్‌కి ఇది ఉండాల్సిన లక్షణం. జాసన్ సంజయ్ విజయ్‌తో కలిసి వర్క్ చేయటం ఓ వండర్ ఫుల్ ఎక్స్‌పీరియెన్స్ అవుతుందని భావిస్తున్నాం. ఇందులో ప్రముఖ నటీనటులు, సాంతికేతిక నిపుణులు పని చేయబోతున్నారు’’ అని తెలిపారు.
డైరెక్టర్ జాసన్ సంజయ్ విజయ్ మాట్లాడుతూ ‘‘లైకా ప్రొడక్షన్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలో నేను తొలి సినిమా చేయబోతుండటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. కొత్త టాలెంట్ ఉన్న ఫిల్మ్ మేకర్స్‌ను ఎంకరేజ్ చేసే ఓ కేంద్రంగా ఈ నిర్మాణ సంస్థ ఉంది. ఈ సంస్థకు నా స్క్రిప్ట్ నచ్చటం నాకెంతో సంతోషాన్ని కలిగించే విషయం. దాన్ని రూపొందించే క్రమంలో పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు వారు తెలియజేయటం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్స్, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయబోతున్నారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సుభాస్కరన్ గారికి థాంక్స్. ఇది నాకెంతో ఎగ్జయిట్‌మెంట్‌తో పాటు పెద్ద బాధ్యత. ఇదే సందర్భంలో నాకెంతో సపోర్ట్ అందించిన తమిళ్ కుమరన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అన్నారు.