హైదరాబాద్‌లోని అంబర్‌పేట ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ అప్పులు, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఎంబీఏ విద్యార్థి శరత్‌కుమార్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుటుంబ సభ్యులతో పాటు స్థానికులను కూడా తీవ్ర విషాదానికి గురిచేసింది.
శరత్‌కుమార్ ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగం సాధించి కుటుంబాన్ని ఆదుకోవాలని కలలు కనేవాడని తెలిసింది. అయితే ఇంట్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితులు అతడిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాయి.
తండ్రి మద్యానికి బానిస కావడంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లిపైనే పడ్డాయి. కూలీ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తల్లి పడుతున్న కష్టాలు, పెరుగుతున్న అప్పులు యువకుడిని తీవ్రంగా కలిచివేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


