25.7 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

రాజకీయాలను వణికించెన్ ‘ శేషన్ ‘

    భారతదేశంలో ఎన్నికలు అనగానే ఎవరికైనా వెంటనే గుర్తుకువచ్చే పేరు టీఎన్ శేషన్‌. మనదేశంలో ఎన్నికల సంఘానికి శేషన్ ఒక క్రేజ్ తీసుకువచ్చారు. ఎన్నికల నిబంధనలు నూటికి నూరు శాతం అమలయ్యేలా చూశారాయన. ఒకదశలో పీవీ నరసింహారావు, జ్యోతిబసు, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి రాజకీయ దిగ్గజాలతో కూడా గొడవలు పడటానికి శేషన్ వెనుకాడలేదు.ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డులు శేషన్ చలవే.అంతేకాదు అనేక సంచలన నిర్ణయాల కు మారుపేరుగా నిలిచారు శేషన్‌. ఎన్నికల సంఘం, ప్రభుత్వంలో భాగం కాదని తెగేసి చెప్పిన కమిషనర్‌ ఆయన. ఎన్నికల సంఘానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుందని యావత్ భారతదేశానికి కుండబద్దలు కొట్టారు టీఎన్ శేషన్‌. మొత్తానికి ఎన్నికల సంఘం అంటే కీలుబొమ్మ కాదని చాటారు తిరునెల్లై నారాయణ శేషన్.

   రెండు తెలుగు రాష్ట్రాలలో మరి కొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ నెలకొంది. జాతీయ పార్టీలైన బీజేపీ,కాంగ్రెస్ సహా అన్ని ప్రాంతీయ పార్టీలు అస్త్రశస్త్రాలతో ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ టీఎన్ శేషన్‌ను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనదేశంలో ఎన్నికల సంఘానికి ఒక క్రేజ్‌, గౌరవం తీసుకొచ్చిన ఘనత నిస్సందేహంగా శేషన్‌దే. కేంద్ర ఎన్నికల సంఘానికి గ్లామర్, గ్రామర్‌ తీసుకువచ్చిన కమిషనర్ టీఎన్ శేషన్‌నే. ఇందులో ఎవరికీ రెండో అభిప్రా యమే లేదు. ఎన్నికల నిబంధనలు నూటికి నూరు శాతం అమలయ్యేలా చూశారాయన. అప్పట్లో శేషన్ పేరు వింటేనే రాజకీయ పార్టీలకు వణుకు వచ్చేది.

    శేషన్ సీఈసీగా బాధ్యతలు తీసుకునేనాటికి కేంద్ర ఎన్నికల సంఘం ఒక ఉత్సవ విగ్రహంలా ఉండేది. ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వంలో భాగంగా అందరూ భావించేవారు. అయితే కేంద్ర ప్రభుత్వంలో ఎన్నికల సంఘం ఏమాత్రం భాగం కాదని టీఎన్ శేషన్ కుండబద్దలు కొట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం, స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ అని శేషన్ అనేకసార్లు తెగేసి చెప్పారు. సీఈసీగా శేషన్ పగ్గాలు చేపట్టక ముందు దేశంలో ఎన్నికల వాతావరణం దారుణంగా ఉండేది. ఎన్నికలు రాగానే గోడల నిండా రాతలే కనిపించేవి. ఇది ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించేది. రాజకీయ పార్టీలు ఏ ఒక్క గోడనూ వదిలేవి కావు. తెల్లగా కనిపించిన ప్రతి గోడా అభ్యర్థుల అనుకూల రాతలతో నిండిపోయేది. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా టీఎన్ శేషన్ బాధ్యతలు చేపట్టాక గోడల మీద రాతల కల్చర్ అకస్మాత్తుగా కనుమరుగైంది. గోడల మీద తమ పేర్లు రాయించ డానికి అభ్యర్థులు వణికిపోయేవారు. ఈ రాతలను శేషన్ ఎక్కడ సీరియస్‌గా తీసుకుని చర్యలు తీసు కుంటారో, ఎక్కడ ఎన్నికను వాయిదా వేస్తారోనని రాజకీయ పార్టీల నేతలు హడలిపోయేవారు.

   శేషన్‌ దెబ్బకు గోడలమీద రాతలే కాదు, మైకుల హోరు కూడా ఒక్కసారిగా అంతర్థానమైంది. స్విచ్ ఆఫ్ చేస్తే బల్బ్ వెలుగు ఆగిపోయినట్లు ఎక్కడి రణగొణధ్వనులు అక్కడే ఆగిపోయాయి. ఒక్కమాటలో చెప్పా లంటే ఎక్కడో హస్తినలో కూర్చుని దేశవ్యాప్తంగా మైకులు మూగబోయేలా చేశారు టీఎన్ శేషన్. అంతేకా దు అప్పట్లో పోలింగ్ కేంద్రాల ఆక్రమణ కూడా చాలా సాధారణ విషయంగా ఉండేది. బీహార్‌ సహా అనేక రాష్ట్రాల్లో బూత్ క్యాప్చరింగ్ సర్వసాధారణంగా ఉండేది. అయితే ఈ బూత్ క్యాప్చరింగ్ దుర్మార్గానికి అడ్డుకట్ట వేసిన ఘనత నిస్సందేహంగా శేషన్‌దే. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పదో కమిషనర్‌ గా శేషన్ పనిచేశారు. 1990 డిసెంబర్ 12 నుంచి 1996 డిసెంబర్ 11 వరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా శేషన్ పనిచేశారు. ఈ నియామకంలో సీనియర్ రాజకీయవేత్త సుబ్రహ్మణ్య స్వామి కీలక పాత్ర పోషించారు. సీఈసీగా ఎన్నికల వ్యవస్థలో శేషన్ అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. వీటిలో ఎన్నికల ప్రవర్తనా నియ మావళి, ఓటర్లకు ఐడీ కార్డులు ముఖ్యమైనవి. అలాగే ఎన్నికల ఖర్చుపై పరిమితి కూడా విధించారు ఆయన.

    శేషన్ రాకముందువరకు ఏ రాష్ట్ర అధికారులు అదే రాష్ట్రంలో ఎన్నికల విధులు నిర్వహించేవారు. దీంతో ఎన్నికల్లో అక్రమాలు జరిగే అవకాశం ఉండేది. అక్రమాలకు దారితీసే ఈ కల్చర్‌కు బ్రేకులు వేశారు శేషన్. ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులను ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్లుగా నియమించారు. ఎన్నికల సంఘం చరిత్రలో అప్పట్లో ఇదొక విప్లవాత్మక మార్పు. శేషన్ తన హయాంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. 1999 లోకసభ ఎన్నికల సమయంలో 1488 మంది అభ్యర్థులను మూడేళ్లపాటు అనర్హులు గా ఆయన ప్రకటించారు. అభ్యర్థులు తమ ఖర్చులకు సంబంధించిన లెక్కలను సమర్పించ డంలో విఫలమయ్యారన్నది శేషన్ చెప్పిన కారణం. శేషన్‌కు తెలిసింది ఒక్కటే. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా నిక్కచ్చిగా విధులు నిర్వర్తించడమే. విధుల నిర్వర్తించే విషయంలో ఎవరి మాటనూ ఖాతరు చేసేవారు కాదు శేషన్‌.

    ఇదే అంశంపై కొన్నిసార్లు పీవీ నరసింహారావు, జ్యోతిబసు, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి రాజకీయ దిగ్గజాలతో కూడా శేషన్ గొడవ పడ్డారు. ఇదిలా ఉంటే అప్పటివరకు కేంద్ర ఎన్నికల సంఘం, ఏకసభ్య కమిషన్‌గా ఉండేది. దీంతో శేషన్ అధికారాలకు కత్తెర వేయడానికి 1999 అక్టోబరులో ఈసీని బహుళ సభ్య కమిషన్‌గా మార్చింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. దీంతో శేషన్ అధికారాలు కొంతమేర తగ్గాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శేషన్ సుప్రీంకోర్టుకెళ్లారు. అయితే ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది. కాలేజీ లెక్చరర్‌గా జీవితాన్ని ప్రారంభించారు శేషన్. తరువాత యూపీఎస్సీ పరీక్షలు రాసి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. తొలిరోజుల్లో తమిళనాడు క్యాడర్‌లో పనిచేశారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ సర్వీసులోకి వెళ్లారు. అనేక మంత్రిత్వ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. సీఈసీగా రిటైర్ అయిన తరువాత 1997లో రాష్ట్రపతి ఎన్నికల్లో శేషన్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కేఆర్ నారాయ ణన్ చేతుల్లో ఆయన ఓడిపోయారు. 2019 నవంబర్ 10న చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు తిరునెల్లై  నారాయణ శేషన్.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్