టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అతను ప్రస్తుతం ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉత్తరాఖాండ్ నుంచి ఢిల్లీ వెళుతున్న పంత్ కారు, రూర్కీ బోర్డర్ వద్ద నర్సన్ ప్రాంతంలో అదుపు తప్పి రెయిలింగ్ ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అతన్ని కాపాడి, దగ్గరలోని రూర్కీ సివిల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్ల సూచన మేరకు ఢిల్లీ తరలించారు.
అయితే ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. ఆసుపత్రి నుంచి పంత్ క్షేమంగా తిరిగి రావాలని ప్రముఖ క్రికెటర్లు అందరూ పోస్టులు పెడుతున్నారు. కొందరు చూసేందుకు వెళ్లాలని కూడా భావిస్తున్నారు.
పంత్ పూర్తి పేరు రిషబ్ రాజేంద్ర పంత్. 1997 అక్టోబర్ 4న ఉత్తరాఖాండ్ లోని రూర్కేలో జన్మించాడు. అయితే అతనికి చిన్నతనం నుంచి క్రికెట్ పై మక్కువ. సరదాగా ఫ్రెండ్స్ తో ఆడేటప్పుడు స్థానికులు పంత్ ఆటని చూసి మెచ్చుకునే వారు. దాంతో తల్లికి కూడా నమ్మకం వచ్చింది. పంత్ కూడా తన 12 యేట నుంచి క్రికెటర్ కావాలని సీరియస్ గా నిర్ణయం తీసుకున్నాడు. దీంతో తల్లి సాయంతో శని, ఆదివారాల్లో ఢిల్లీలోని సోనెట్ క్రికెట్ అకాడమీకి వెళ్లేవాడు.
ఢిల్లీలో సరైన నివాస సౌకర్యం లేక మోతీబాగ్ లోని గురుద్వార్ లో ఉండేవారు. అలా ఎన్నో కష్టాలు పడి క్రికెట్ పాఠాలు నేర్చుకుని జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. అయితే చిన్నవయసులోనే జట్టులో చేరిన తను అనతికాలంలోనే అంతర్జాతీయ క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. ఇండియాలోకన్నా విదేశాల్లో పంత్ గణాంకాలు బాగుండటం విశేషం.
ధోనీ వారసుడిగా కీర్తి ఘడించాడు. దురదృష్టవశాత్తూ ఫామ్ లేక అవస్థలు పడ్డాడు. అయితే రిషబ్ తండ్రి 2017లో గుండెపోటుతో మరణించాడు. ఇప్పుడు పంత్ కి ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు భయాందోళనలో ఉన్నారు. అయితే డాక్టర్లు ప్రమాదమేమీ లేదని చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
బంగ్లాదేశ్ తో జరిగిన రెండు టెస్టు మ్యాచుల్లో ఫామ్ అందుకుని, జట్టును ఓటమి కోరల నుంచి కాపడటంలో వంత్ తనవంతు పాత్ర సమర్థవంతంగా పోషించాడు.అయినా సరే వన్డే, టీ 20 టీమ్ లో పంత్ ని సెలక్ట్ చేయకపోవడం అది ఒక దెబ్బ అయితే, సడన్ గా ఇలా ప్రమాదం జరగడం మరొక దెబ్బ అని పలువురు వ్యాక్యానిస్తున్నారు. చిన్నవయసులో ఎంతో పట్టుదలగా జాతీయ జట్టులోకి వచ్చిన పంత్ త్వరగా కోలుకోవాలని క్రికెట్ అభిమానులు, ప్రజలు కోరుతున్నారు.