మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వేరే పదవి ఆఫర్ చేసిందా? తనకు మంత్రి పదవి తప్ప వేరే పదవి ఏదీ వద్దని ఆయన ఖరాఖండీగా చెప్పేశారా? అంటే కాంగ్రెస్ వర్గాలు అవుననే అంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచో అమాత్య పదవిపై ఆశల పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి.. మంత్రి పదవి ఇస్తామని చెప్పడంతోనే కాంగ్రెస్‌లో చేరినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా.. అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి దక్కింది. కానీ రాజగోపాల్ రెడ్డి విషయంలో పార్టీ మొండి చెయ్యి చూపించింది. కనీసం విస్తరణలో అయినా మంత్రిగా ప్రమోట్ చేస్తారని రాజగోపాల్ భావిస్తుండగా.. ఆయనకు మరో పదవి ఆఫర్ చేయడంతో తిరస్కరించారట.
సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా మీడియాలో మంత్రి వర్గ విస్తరణ గురించే చర్చ జరుగుతుంది. అధిష్టానం ఓకే చేసే లిస్టులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ఉంటుందా లేదా అనే డైలమానే కొనసాగుతుంటుంది. అయితే పలు సమీకరణల వల్ల రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం కష్టమని కాంగ్రెస్ పార్టీ సంకేతాలు పంపిందట. దానికి బదులుగా కీలకమైన మరో పోస్టు ఇస్తామని చెప్పిందట. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఇప్పటికే మూడు విప్ పోస్టులు భర్తీ చేసిన రేవంత్ రెడ్డి.. చీఫ్ విప్ పదవిని మాత్రం ఏడాదిగా ఖాళీగానే ఉంచుతున్నారు. కేబినెట్ హోదాకు సమానమైన చీఫ్ విప్ పదవిని రాజగోపాల్ రెడ్డికి ఇస్తామని ఆఫర్ ఇచ్చారట.
ఒకవైపు మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్న రాజగోపాల్ రెడ్డి వద్దకు చీఫ్ విప్ పదవి ఇస్తామని ఆఫర్ ఇవ్వడంతో ఆయన తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. నాకు కేబినెట్ బెర్త్ కావాలని అడుగుతుంటూ.. కేబినెట్ హోదా ఉన్న పదవి ఇస్తామనడం ఏంటని రివర్స్‌లో ఎటాక్ చేశారట. తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అమాత్య పదవే కావాలని.. ఈ చీఫ్ విప్ పదవి తనకు వద్దే వద్దని తేల్చి చెప్పారట. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజగోపాల్‌కు మంత్రి పదవి ఇవ్వడంలో ఉన్న చిక్కులను వివరించి చెప్పిందట. ప్రస్తుతానికి చీఫ్ విప్ పదవి తీసుకోవాలని.. భవిష్యత్‌లో అవకాశం ఉంటే మంత్రి పదవి ఇస్తామని బుజ్జగిస్తోందట.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీకి వెళ్లారు. వారితో మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. దీంతో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. అధిష్టానం వద్ద గ్రీన్ సిగ్నల్ కూడా లభించినట్లు వార్తలు వచ్చాయి. కానీ అధిష్టానం కేవలం పార్టీకి సంబంధించిన పదవుల భర్తీపైనే చర్చించిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అంతే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉండొచ్చని.. అదంతా అధిష్టానమే చూసుకుంటుందని చెప్పారు. దీంతో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న రాజగోపాల్ రెడ్డి డైలమాలో పడ్డారట. ఇప్పుడు చీఫ్ విప్ పదవి కూడా తీసుకోకపోతే.. భవిష్యత్‌లో ఆ పదవైనా ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తున్నారట.
వాస్తవానికి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి తన సామాజిక వర్గమే అడ్డుగా ఉందట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. అదే జిల్లా నుంచి మరో రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వడం కష్టమని చెబుతున్నారట. పైగా ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి ఎలా మంత్రి పదవి ఇవ్వగలమని కూడా రాజగోపాల్ రెడ్డికి సర్థి చెప్పారట. అందుకే చీఫ్ విప్ పదవిని తీసుకోవాలని కోరుతున్నారట.
కాగా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు పూర్తిగా డైలమాలో పడిందట. చీఫ్ విప్ పదవిని తీసుకునేందుకు ఆయన సిద్ధంగా లేరట. అదే సమయంలో మంత్రి పదవి వస్తుందా రాదా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారట. దీంతో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారనే విషయంలో ఉత్కంఠత నెలకొంది. ఏం జరుగుతుందో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.