స్వతంత్ర, వెబ్ డెస్క్: భారత వాతావరణ కేంద్రం దేశ ప్రజలకు శుభవార్త అందించింది. కొన్నిరోజులుగా దోబూచులాడుతున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. రుతుపవనాల రాకతో కేరళ తీర ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. నిర్ణీత సమయం ప్రకారం అయితే జూన్ 1వ తేదీన రుతుపవనాలు ప్రవేశించాలి. అయితే వారం రోజులు ఆలస్యంగా కేరళలోకి ప్రవేశించాయి. మరో వారం రోజుల్లో రాయలసీమలోకి ప్రవేశిస్తాయని ప్రకటించింది. అనంతరం రెండు, మూడు రోజుల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించనున్నాయని పేర్కొంది. ప్రముఖ ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ఈనెల 8, 9వ తేదీల్లో రుతుపవనాలు తీరాన్ని చేరతాయని వేసిన అంచనాలే నిజం కావడం విశేషం. 2022లో మే 29న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. 2021లో జూన్ 3న రాగా, 2020లో జూన్ 1నే వచ్చాయి. 2019లో జూన్ 8న, 2018లో మే 29న అడుగు పెట్టాయి.