ప్రీ ఎస్టిమేటెడ్ ప్లాన్, నిర్దిష్ట కాలానికి ఆదాయ వ్యయాల అంచనా, నిర్వచించిన కాలానికి జమలు,ఖర్చుల అంచనా, ఆదాయ వ్యయ ప్రణాళిక… ఇవన్నీ బడ్జెట్ నిర్వచనాలే. రాబోయే ఆర్థిక సంవత్సరానికి, గత ఏడాది ఆదాయ, వ్యయాల ఆధారంగా ముందుగా రూపొందించేదే బడ్జెట్. వ్యక్తులు, సంస్థలు, సర్కార్లు.. ఇలా ఎవరైనా బడ్జెట్ రూపొందించుకోవడం తప్పక జరుగుతుంది. ఇక సాక్షాత్ కేంద్ర సర్కార్ బడ్జెట్ అంటే.. దేశ ప్రజలకు ఎంత ఆసక్తి , ఎంత ఉత్కంఠ ఉంటుంది అనేది వేరే చెప్పాల్సిన పని లేదు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం దేశ బడ్జెట్ అంటే నిర్ధిష్ట సంవత్సరానికి కేంద్ర సర్కారు అంచనా వేసిన ఆదాయ, వ్యయాల ఆర్థిక ప్రకటన. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈమారు సైతం రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ప్రథమ విడత సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్నాయి. రెండో విడత సమావేశాలు దాదాపు నెల్లాళ్ల విరామం అనంతరం మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.
తొలి విడత సమావేశాల మొదటి రోజున అంటే ఈ నెల 31న దిగువ సభ, ఎగువ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1 వ తేదీన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ 2025-26కు సంబంధించిన కేంద్ర వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్నారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో ఎన్డీఏ సర్కారు హ్యాట్రిక్ విజయంతో మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. క్రమం తప్పకుండా కేంద్ర బడ్జెట్ ను నిర్మల సీతారామన్ వరుసగా ప్రవేశపెట్టడం ఇది ఎనిమిదోసారి. దేశ చరిత్రలో ఈ మైలురాయిని సాధించిన తొలి కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆమె నిలవనున్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, వేతన జీవులు ఎప్పుడూ బడ్జెట్ అనగానే.. ఇన్ కం ట్యాక్స్ కన్సిషన్ పైనే దృష్టిసారిస్తారు. అదేవిధంగా రాష్ట్రాలకు ప్రకటించిన పరిశ్రమలు రాకకు, వివిధ రంగాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి, ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు బడ్జెట్ లో కేటాయింపులు ఎలా ఉంటాయో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వేతన జీవుల్లో ఇన్ కమం ట్యాక్స్ పై ఎంత ఆసక్తి ఉంటుందో, పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లలోని ప్రావిడెంట్ ఫండ్ పింఛనర్లకు బడ్జెట్ లో పింఛన్ పెంపుదలపై అంత ఆశ ఉంటుంది. ఎందుకంటే..ప్రైవేట్ సెక్టర్ లో రిటైరైన ఉద్యోగులు, కార్మికులు మినిమమ్ పీఎఫ్ పింఛన్ కేవలం వెయ్యిరూపాయలే. ఎన్నో రాష్ట్రప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఎన్నెన్నో వర్గాలకు ఎన్నో రీతుల్లో పథకాలు అందిస్తున్నాయి. పేదల అభ్యున్నతికి పాటు పడుతున్నాయి. అలా అందించే..పింఛన్లే అయిదు వేలు, ఆరు వేల రూపాయలు ఉంటోంది. ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం.
ప్రైవేట్ సెక్టార్ లోని రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులు .. పిఎఫ్ పింఛన్ పెంపుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కేవలం వెయ్యి రూపాయలుగా పింఛన్ ఉంది. దీనిని పెంచాలని పిఎఫ్ పింఛనర్లు చాలాకాలంగా కోరుతున్నారు. ఎన్నో స్కీముల్లో, పథకాల్లో పేద ప్రజలకు ఉచితంగా ఇచ్చే పథకాలే అయిదు వేలు, ఆరువేలుగా ఉంటున్నాయని, ముప్పై, నలభై ఏళ్లపాటు కర్మాగారాల్లో, కంపెనీల్లో, సంస్థల్లో పనిచేసిన కార్మిక, శ్రామిక వర్గాలకు పిఎఫ్ పింఛన్ వెయ్యి రూపాయలే ఉండడం బాధాకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఎనిమిదో పే కమిషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర సర్కారు.. ఈ మారు తమ విషయాన్ని తప్పక పరిగణనలోకి తీసుకుని పిఎఫ్ పింఛన్ పెంచుతుందని దేశవ్యాప్తంగా ఉన్న ప్రావిడెంట్ ఫండ్ పింఛన్ దారులు ఆశాభావంతో ఉన్నట్టు తెలుస్తోంది.