గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 34 ఏళ్ల వైద్యురాలి హత్యచార ఘటనలో నిందితుడు సంజయ్‌రాయ్‌కు కోర్టు జీవితఖైదు విధించింది. తమ కుమార్తెను కోల్పోయిన దంపతులకు రూ. 17 లక్షలు చెల్లించాలని సిటీ కోర్టు ఆదేశించింది. అయితే తల్లిదండ్రులు తమకు ఆర్థిక సహాయం అక్కర్లేదని చెప్పారు.
పౌర పోలీస్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను కోల్‌కతా కోర్టు దోషిగా తేల్చింది. సోమవారం ఈ ఘటన అరుదైన కేసు కేటగిరీలోకి రాదని వ్యాఖ్యానించింది. మరణశిక్ష విధించకపోవడానికి ఇదే కారణమని తెలిపింది. అనంతరం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది.
సీల్దా కోర్టులో న్యాయమూర్తి అనిర్బన్ దాస్ తీర్పు ఇస్తూ.. బాధితురాలి తల్లిదండ్రులకు రూ.17 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. కోర్టుకు హజరైన బాధితురాలి తల్లిదండ్రులు.. తమకు పరిహారం వద్దని, న్యాయం కావాలని న్యాయమూర్తికి తెలిపారు.
దీనికి న్యాయమూర్తి బదులిస్తూ.. తాను ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చానని, వారు డబ్బును కోరుకున్నట్లు ఉపయోగించుకోవచ్చని చెప్పారు. దీన్ని అత్యాచారం, హత్యలకు పరిహారంగా చూడవద్దని, చట్టపరమైన నిబంధనలలో భాగంగా చూడాలని కోరారు.
శిక్ష ఖరారు చేయడానికి ముందు నిందితుడు సంజయ్ రాయ్ తాను ఏ నేరం చేయలేదని కోర్టుకు వెల్లడించాడు.
“నేను ఏ తప్పు చేయలేదు. నన్ను ఇరికించారు. ఈ కేసులో చాలా ఆధారాలు ధ్వంసమయ్యాయి. నేను ఎప్పుడూ రుద్రాక్ష ధరిస్తాను. నేను నేరం చేసి ఉంటే నా రుద్రాక్ష మాల విరిగిపోయేది. నన్ను ఇరికించారో లేదో దానిని బట్టే మీరు నిర్ణయించుకోండి.” అని అన్నాడు
జడ్జి మాట్లాడుతూ.. “నా ముందున్న సాక్ష్యాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటాను. మూడు గంటల పాటు మీ వాదనలు కూడా విన్నాను. మీ న్యాయవాది మీ కేసు వాదించారు. అభియోగాలు రుజువయ్యాయి. ఇప్పుడు శిక్షపై మీ అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను” అని అన్నారు.