నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బాంద్రాలోని తన ఇంట్లో అగంతకుడు చోరీకి ప్రయత్నించిన సమయంలో కత్తితో దాడి చేయడంతో సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆరు రోజుల చికిత్స తర్వాత ముంబైలోని లీలావతి ఆసుపత్రి నుండి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం, డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ జరుగుతున్నాయి. కాసేపట్లో ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంది. సైఫ్ తల్లి , ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్ అతనితో ఉన్నారు. సైఫ్ భార్య కరీనా కపూర్ ఖాన్ కొద్దిసేపటి క్రితం ఇంటికి బయలుదేరారు. అయితే డాక్టర్లు సైఫ్‌ను పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. తనకు ఇన్‌ఫెక్షన్ కాకుండా ఉండేందుకు ఎక్కడికీ వెళ్లొద్దని.. ఎవరినీ ఇంటికి రానీయవద్దని సూచించారు.
దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటన ముంబై శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తాయి. తన ఇంట్లోకి చొరబడిన వ్యక్తి కత్తితో దాడి చేయడంతో సైఫ్ అలీఖాన్ ఆరు కత్తిపోట్లకు గురయ్యాడు. గాయాల నుంచి తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఆయనను గత బుధవారం అర్థరాత్రి ఆటో రిక్షాలో ఆసుపత్రికి తరలించారు. కత్తి వెన్నుముకకు 2 మిల్లీమీటర్ల సమీపం వరకు వచ్చి ఆగిందని.. దీంతో ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు అన్నారు. సర్జరీ చేసి కత్తిని బయటకు తీశారు. చెయ్యి, మెడపై గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. అతనిని విచారిస్తున్నారు.