కోట్ల మంది స్నానాలు చేస్తున్నారు.. అంటూ గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ, పోతున్న ప్రాణాలకు జవాబుదారీ అనే మాటకు మాత్రం సమాధానం లేదు! ఈ సారి మహాకుంభమేలాలో స్నానాల ఘాట్ సమీపంలో జరిగిన ఒక తొక్కిసలాట ఘటన మరకవముందే.. కుంభమేలా ప్రయాణికుల రద్దీతో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో మరో దర్ఘటన చోటు చేసుకుంది! ఈ మరణాలకు సంతాపం ప్రకటించటం, బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేయటం సరే… జరిగిన ఘోర ఉదంతానికి నైతిక బాధ్యత వహించాల్సిందెవరు? ఇలాంటివి పునరావృత్తం కానీయ బోమని చెప్పేదెవరు?
వరుస ప్రమాదాలతో కుంభమేలా రక్తమేలాగా మారుతోంది. అయినా ప్రభుత్వానికి పట్టడం లేదు. ప్రచార ఆర్భాటం తప్ప.. కుంభమేలాకు వస్తున్న ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కల్పించలేదు. ఫలితంగా పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. తొక్కిసలాటల్లో పోతున్న ప్రాణాలు కొన్నైయితే.. కుంభమేలాకు వస్తూ పోతూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డ వారెందరో..! ఇవన్నీ మరణాలు చూశాకా.. ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ కుంభమేలా? అని ప్రజలు పెద్ద ఎత్తున గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. ఒక పద్దతీ పాడు లేకుండా.. అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు ఒక క్రమశిక్షణ లేకుండా ఇలాంటి పరిస్థితులకు కారణం అవుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు!
దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్నడు ఓ మహాకవి. ఇప్పుడు ఆ మనుషులు ఎక్కువైయ్యారు. ప్రభుత్వాలకు లాభం పెరిగింది. ఈ దేశంలో బతికేందుకు నిత్యం పన్నులు కడుతున్నా… ఆ పన్నుల ప్రతిఫలం అందక.. మళ్లీ అదే మట్టిలో కలిసిపోతున్నారు ప్రజలు. అవును మనం మట్లాడుకుంటుంది నిజమే..! ఈ దేశంలో బతికే ప్రతీపౌరుడిపై ఏదో ఒకరూపంలో పన్నుభారం పడుతోంది. అది ప్రభుత్వాలకు చేరుతుంది. అయితే ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడంలో ప్రభుత్వాలు పెడుతున్న శ్రద్ద.. సౌకర్యాలు కల్పించడంపై పెట్టడం లేదు. పోయేది పేదల ప్రాణాలే కదా..! ఎవడడుగుతాడులే అన్న ధీమా..! ప్రజల సొమ్ముతో దర్జా వెలగబెడుతున్న పాలకులకు… ఆ ప్రజల బాధలు కనబడటం లేదు. పోయిన ప్రాణాలకు వెలకట్టి.. చితి కట్టెలకు డబ్బులు ఇస్తున్నారే గానీ… మెరుగైన వసతులు కల్పించడం లేదు.
ఇంత జనాభాను తరలించాలంటే ఎన్ని రైళ్లు కావాలి… కాని ఉండవు. అదీ కుంభమేలా వంటి ప్రత్యేక సమయాల్లో ప్రభుత్వం ఇంకెన్ని రైళ్లు నడపాలి… కాని నడపదు. భారీగా వస్తున్న ప్రజలను క్రమబద్దీకరించడానికి ఎంతమంది భద్రతా సిబ్బందిని నియమించాలి… కాని నియమించరు. వెల్లువలా వచ్చిపడుతున్న ప్రయాణికులు, రివాజు తప్పకుండా ఆలస్యంగా వచ్చిపోయే రైళ్లు, ఉన్న గందరగోళాన్ని ఒకింత పెంచే అనౌన్స్మెంట్లు, ఏమూలకూ సరిపోని మౌలిక సదుపాయాలు… ఇవన్నీ ఏకమై 45 నిమిషాలపాటు ఏకధాటిగా సృష్టించిన తీవ్ర గందరగోళ స్థితి శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు దారితీసి 18 మంది ప్రాణాలను బలి తీసుకుంది.
మన దేశంలో ఎప్పుడు జనసమ్మర్ధం అధికంగా ఉంటుందో, ఏ చర్యలు అవసరమో అధికార యంత్రాంగానికి తెలియక కాదు. అందుకు సంబంధించి ఇప్పటికే బోలెడు చేదు అనుభవాలున్నాయి. కుంభమేలాలో తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయిన తర్వాత కూడా దానికి నుంచి ప్రభుత్వం గుణపాఠం నేర్వకపోవడమే ఈ విషాద ఘటనకు దారితీసింది. కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్జ్ లో తొక్కిసలాట చోటు చేసుకుని 30 మంది ప్రాణాలు బలై 15 రోజులు కూడా కాలేదు. అదే ప్రయాగ్రాజ్ కు బయల్దేరిన భక్తులకు ఢిల్లీ రైల్వే స్టేషనే ఈసారి మృత్యుఘంటిక మోగించింది.
ఢిల్లీ అజ్మీరీ గేట్ టెర్మినల్ సాధారణంగా ప్రజలతో కిక్కిరిసి ఉంటుంది. ఢిల్లీ మెట్రో రైల్ ను నేరుగా అనుసంధానం చేసే ఈ స్టేషన్ కు నిత్యం వేలాది మంది ప్రజలు వస్తుంటారు. యూపీ మీదుగా వెళ్లాల్సిన రైళ్లు ఆగే అయిదు ప్లాట్ ఫాంలు అజ్మీరీ గేట్ టెర్మినల్ ప్రాంతంలోనే ఉన్నాయి. దానికితోడు ఇప్పుడు కుంభమేళా సంరంభం కొనసాగుతోంది. కుంభమేలాకు ప్రయాణించాల్సిన రైలు లేట్ కావడంతో.. అది స్టార్ట్ అయ్యేంత వరకూ టికెట్లను ఇస్తూనే ఉన్నారు అధికారులు. ఒక రైలుకు ఎన్ని టికెట్ లను జారీ చేయాలనే పద్ధతి పాడు లేకుండా టికెట్లు జారీ చేయడమే ఈ తొక్కిసలాటకు కారణమైంది.
భారత్ లో రైలు ప్రయాణమంటే నరప్రాయమే..! అందులోనూ కన్ఫామ్ టికెట్ లేకుండా ప్రయాణించడం అంటే ఇంటికి చేరుకునే సరికి జ్వరం రావాల్సిందే..! సీట్ల లెక్కన చూస్తే ఒక్కో బోగీలో ప్రయాణించగల గరిష్ట ప్రయాణికుల సంఖ్య 90. ఒక ఎక్స్ ప్రెస్ రైలుకు నాలుగు జనరల్ బోగీలు ఉంటాయనుకుంటే.. రైలు స్టార్ట్ అయ్యే స్టేషన్ లో అయినా ఆ మేరకు 360 టికెట్లకు మించి అమ్మకూడదు! అయితే.. ఈ నియమాన్ని ఎప్పుడూ పాటించిన పరిస్థితి కనపడదు. ఎంతమంది వస్తే అంతమందికీ జనరల్ టికెట్లను ఇస్తూనే ఉంటారు! దీంతో.. జనరల్ బోగీల్లో విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది. 90 మంది ప్రయాణించాల్సిన బోగీలో కనీసం మూడు వందల మంది, నాలుగు వందల మంది కూడా ప్రయాణించడానికి తగినట్టుగా టికెట్లను ఇస్తూనే ఉంటారు! స్టార్ట్ అయ్యే ప్రధాన స్టేషన్లలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక మార్గమధ్యంలో ట్రైన్ ఆగే స్టేషన్లలో ఎక్కే ప్రయాణికుల సంగతి ఏంటో అధికారులకే తెలియాలి.
అజ్మీరీ గేట్ టెర్మినల్ రైల్వే స్టేషన్ లో ప్రతీ రోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటలలోపు బయల్దేరే రైళ్లను అందుకోవటానికి వచ్చే జనరల్ కంపార్ట్మెంట్ ప్రయాణికులకు అక్కడ రోజూ 7వేల టిక్కెట్లు విక్రయిస్తారు. కానీ శనివారం రోజు కేవలం రెండు గంటల వ్యవధిలో అదనంగా మరో 2వేల 600 మందికి టిక్కెట్లు విక్రయించారు. అంటే రిజర్వేషన్లేని ప్రయాణికుల సంఖ్య దాదాపు పదివేలు. ఇంత మంది టికెట్ల తనిఖీ అసాధ్యం. కనుక టికెట్ లేకుండా ప్రయాణించేవారు ఇంతకు మూడు నాలుగు రెట్లు అధికంగా ఉంటారని ఒక అంచనా. అందుబాటులో ఉన్న బోగీలెన్నో, జారీ చేయాల్సిన టికెట్లెన్నో కనీస అంచనాకు రాకపోవటం… అవసరమైన పోలీసు బలగాలను సమకూర్చుకోవాలన్న స్పృహ లోపించటం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతంలో 20 మంది పోలీసులు మాత్రమే ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వారు సైతం ఈ తొక్కిస లాట సమయంలో బతుకుజీవుడా అనుకుంటూ పక్కకుపోయారు.
ఇలా ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాటకు కారణాలు అనేకం. కుంభమేలా అంటూ గొప్పులు చెప్పుకుంటున్న కేంద్రం మెరుగైన సౌకర్యాలు.. అందులో దేశ రాజధానిలో సౌకర్యాలు కల్పించడంలో విఫలమైయింది.