హైదరాబాద్ నగర శివారులోని కొల్లూరు పరిధిలో భారీ స్టాక్ మార్కెట్ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నుంచి రూ.1.22 కోట్లు వసూలు చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో సాగర్ కుమార్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే భారీ లాభాలు వస్తాయని సాగర్ కుమార్ బాధితుడిని నమ్మించాడు. మొదట చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టించి కొంత నమ్మకం కలిగించిన అనంతరం, విడతల వారీగా పెద్ద మొత్తాల్లో డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మొత్తం రూ.1.22 కోట్ల వరకు నగదు బదిలీ చేసినప్పటికీ, వాగ్దానం చేసిన లాభాలు ఇవ్వలేదు. తర్వాత డబ్బుల విషయమై ప్రశ్నించగా సాగర్ కుమార్ స్పందించకపోవడంతో బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించాడు.
దీంతో బాధితుడు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. రూ.కోటికి పైగా నగదు లావాదేవీలు ఉండటంతో ఈ కేసును ఈవోడబ్ల్యూ (Economic Offences Wing) విభాగానికి బదిలీ చేశారు.
ప్రస్తుతం పోలీసులు నిందితుడి ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలు, ఇతర బాధితులు ఉన్నారా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో స్టాక్ మార్కెట్ పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.


