25.7 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

వరంగల్ గడ్డపై దళిత నేతల మధ్య ఎలక్షన్ వార్

     వరంగల్‌ జిల్లాలో ఎలక్షన్‌ వార్‌ తగ్గాఫర్‌గా సాగుతోంది. ఓరుగల్లు రాజకీయాలు నువ్వా నేనా అన్న రేంజ్‌లో విమర్శలు, ప్రతివిమర్శలతో సమ్మర్‌ను మించి కాకపుట్టిస్తున్నాయి. ఒకగూటి పక్షులే ప్రత్యర్థులు గా మారడంతో మాటల దాడికి దిగుతున్నారు. సై అంటే సై అంటూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతు న్నారు. దీంతో కౌంటర్‌ ఎటాక్‌లు, సెటారికల్‌ కామెంట్లతో ఓరుగల్లు రాజకీయం రంజుగా సాగుతోంది.

మొన్నటి వరకూ ఒకగూటి పక్షులే. కానీ పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చే సరికి సీన్‌ మారిపోయింది. ఆలింగనాలు చేసుకున్న మిత్రులు కాస్తా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా రాజకీయ శత్రవులయ్యారు. కడియం శ్రీహరి కూతురు కావ్య, మారపల్లి సుధీర్, అరూరి రమేష్‌ కొద్ది రోజుల ముందుకు వరకూ గులాబీ దళంలో పార్టీ కోసం పని చేశారు. అయితే,.. తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఆ ముగ్గురిలో ఇద్దరు పార్టీ ఫిరాయించేశారు. కడియం కావ్య హస్తం చేయి అందుకుంటే,.. ఆరూరి రమేష్‌ కాషాయం జెండా కప్పుకున్నారు. అలా కండువా మారిపోయారో లేదా ఇలా గెలుపు వ్యూహాలు రచిస్తూ పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలతో తగ్గేదేలే అంటూ రెచ్చిపోతు న్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రజల్లో వారిని పలుచన చేసే పనిలో పడ్డారు.

వరంగల్ పార్లమెంట్‌ బరిలో దిగిన ముగ్గురు కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వారే. కడియం కావ్య తన తండ్రి ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే,.. ఆమెకు బీఆర్ఎస్‌లో ప్రత్యక్షంగా భాగస్వామ్యం లేనప్పటికీ శ్రీహరి బిడ్డగా దశాబ్ధ కాలంగా కావ్య అందరికీ సుపరిచితులే. అలాగే సుధీర్‌ కుమార్‌ బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి. ఇక అరూరి రమేష్ 2004 ఎన్నికల తర్వాత కొంతకాలా నికి పీఆర్పీ నుంచి బీఆర్ఎస్‌ గూటికి చేరి.. కొద్ది రోజుల ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే,.. శ్రీహరికి ప్రాధాన్యతనిస్తూ సిట్టింగ్‌ ఎంపీ పసునూరిని పక్కన పెట్టి, టికెట్‌ ఆశిస్తున్న ఆరూరిని కాదని పార్లమెంట్‌ పోరులో కడియం కావ్యకు అవకాశం కల్పించింది బీఆర్‌ఎస్‌ హైకమాండ్‌. ఆ సమయంలో ఆమెకు పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. కేవలం కడియం శ్రీహరి కుమార్తెగానే పార్టీ అధిష్టానం కావ్యకు టికెట్‌ ఇచ్చింది. కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించకుండా ఉండేందుకు రాజకీయ ఎత్తుగడతోనే గులాబీ బాస్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ కేసీఆర్‌ వ్యూహం ఫలించలేదు. ఆయన ఊహించినట్టే కడియం షాక్‌ ఇస్తూ పార్టీ ఫిరాయించారు. బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయి గడ్డు పరిస్థితు లను ఎదుర్కొంటున్న వేళ.. తన కూతురు విజయం అంత సులువుకాదని భావించిన శ్రీహరి.. కాంగ్రెస్‌ హవా నడుస్తుండటంతో ఆ పార్టీలోకి జంప్‌ అయ్యారు. ఇచ్చిన అవకాశం కూడా వద్దనుకుని కూతురితో సహా హస్తం తీర్థం పుచ్చుకున్నారు.

     గత ఐదేళ్లుగా తన కూతురు కావ్యను రాజకీయ వారసులిగా రంగ ప్రవేశం చేయించేందుకు కడియం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ముందుగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో దించాల నుకున్నారు. కానీ, స్థానిక రాజకీయ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేని కారణంగా అది సాధ్యంకా లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఓడి, కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్న విమర్శలు వెల్లువెత్తాయి.దీంతో అప్రమత్తమైన సీఎం రేవంత్‌ టీం ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపింది. అందులో భాగంగానే కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కూతురుతో సహా కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్‌లో చేరితేనే తన బిడ్డ విజయం ఖాయమని భావించే కడియం ఈ నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ ఎంపీ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కడియం మినహా అన్ని కాంగ్రెస్‌ సొంతం చేసుకుంది. దీంతో తాను కూడా ఆ పార్టీలో చేరితో కాంగ్రెస్ బలం ఏకపక్షంగా మారి తన బిడ్డ గెలుపు సులువవుతుందని భావించారు కడియం శ్రీహరి.

కడియం కావ్య బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పడంతో ఉద్యమకారుడైన మారపెల్లి సుధీర్‌ను బరిలో దించింది బీఆర్‌ఎస్‌. సుధీర్‌కుమార్‌ బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ముందున్నారు. పార్టీకి ఆయన సేవలు గుర్తించి హనుమకొండ జెడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించారు కేసీఆర్‌. ముందు నుంచి పార్టీకి కేసీఆర్‌తోపాటు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావుకు విధేయుడిగా ఉన్నారు సుదీర్‌కుమార్‌. ఏనాడూ పార్టీని ఇబ్బందులు పెట్టిన సందర్భం లేదు. పైగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, విద్యావంతుడు, జెడ్పీ చైర్మన్‌గా చేసిన అనుభవం ఉంది. దీంతోనే కేసీఆర్‌ మారపల్లికి అవకాశం కల్పిస్తూ టికెట్‌ ఇచ్చారు. మరోవైపు ఈ నిర్ణయంతో ఉద్యమకారులను గౌరవించి నట్టు ఉంటుందని.. తనపై వస్తున్న విమర్శలకు కొంతైనా చెక్‌ పెట్టవచ్చని భావించారు కేసీఆర్‌. దీంతోనే సుధీర్‌కుమార్‌ను పార్లమెంట్‌ ఎన్నికల రేసుకు ఎంచుకున్నారు. మరోపక్క ఆరూరి, కడియం పార్టీ ఫిరాయించడంతో క్యాడర్‌ ఆగ్రహంగా ఉన్నారు. ఈ సెంటిమెంట్‌ పనిచేయాలంటే ఉద్యమకారుడనే బ్రాండ్ ఉపయోగపడుతోందన్న ఎత్తుగడ వేశారు. తాటికొండ రాజయ్యకు టికెట్ ఇస్తే పార్టీని కాదన్న వ్యక్తిని పిలిచి అవకాశం ఇచ్చారనే విమర్శలకు తావిచ్చినట్టువుతుందని బీఆర్‌ఎస్‌ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇక తనకు టికెట్‌ దక్కదని ముందే పసిగట్టిన ఆరూరి రమేష్‌ ఈ గట్టు నుంచి బీజేపీ గట్టుకు చేరిపోయారు. కాషాయం కండువాకు ముందు ఆరూరి హైడ్రామా ఓ రేంజ్‌లో నడిచింది. బీజేపీలో చేరికపై జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ.. స్వయంగా కేసీఆరే మంతనాలు జరిపారు. అయితే,వారి ముందు తలూపిన ఆరూరి ఆ తర్వాతే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఆరూరి ఆశించినట్టే కమలనాథులు ఆయనకు టికెట్ ఇవ్వడంతో ఎంపీ అభ్యర్థిగా కావ్య, మారెపల్లిపై ఎన్నికల యుద్ధానికి సిద్దమయ్యారు. అయితే, ఆరూరి బీజేపీలో చేరికపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో ఆయనపై వచ్చిన భూకబ్జాలు, అవినీతి ఆరోపణలు నుంచి రక్షణ లభిస్తుందనే వ్యూహంతోనే కాషాయం కండువా కప్పుకున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఆయన భారీగా భూకబ్జాలకు పాల్పడ్డారనే అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే,.. బీజేపీకి సరైన అభ్యర్ధి లేకపోవడం, ఆర్ధిక బలం, మాదిగ సామాజిక వర్గం, స్థానికుడు మాజీ ఎమ్మెల్యే కావడంతో ఆరూరికి బీజేపి గాలం వేసినట్లు తెలుస్తోంది.

ఇక ఇలా కడియం కావ్య, ఆరూరి రమేష్‌ పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌, బీజేపీల నుంచి బరిలో దిగడంతో ఒకగూటి పక్షులే ఇప్పుడు ప్రత్యర్థులుగా పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఎవరికి వారు తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యంగా కడియం శ్రీహరిని టార్గెట్‌ చేస్తున్నారు ఆరూరి రమేష్‌, మారెపల్లి. కడియం దళితులను ఎదగనివ్వలేదని.. ఆయన ఎంతో మంది దళిత నాయకుల అవకాశాలను కడియం లాక్కున్నారని ఫైర్‌ అయ్యారు. ఉద్యమంలో కష్టాలు, నష్టాలు తాము అనుభవిస్తే పదవులు కడియం అనుభవించారంటూ ధ్వజమెత్తారు సుధీర్‌కుమార్‌. బిడ్డకు ఎంపీ అవకాశం కల్పించినా, పార్టీకి ద్రోహం చేశారని విమర్శించారు. కావ్య పార్టీకి ఏం చేసిందని ప్రశ్నించారు. ఇదే తరహాలో ఆరూరిపై కూడా నిప్పులు చెరిగారు. మూడు పర్యాయాలు పార్టీ ఆరూరికి అవకాశం కల్పించిందని… అధికారం కోల్పోయేసరికి అవకాశవాదంలో పార్టీని మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడయం కావ్య అసలు స్థానికురాలే కాదని.. గుంటూరుకు చెందిన మహమ్మద్‌ కావ్యకు ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని ప్రశ్నిస్తున్నారు బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు. వీరికి కావ్యతోపాటు, కడియం కూడా కౌంటర్‌ ఇచ్చారు. తండ్రి కులమే పిల్లలకు వర్తిస్తుంది అంటూ విమర్శలను తిప్పికొట్టారు. అరూరి రమేష్ మాత్రం కడియం పైన విరుచుకపడుతున్నారు. కడియం స్వార్ధపరుడని, మాదిగలను అణచివేశారని, మొన్నటి ఎన్నికల్లో తన ఓటమికి బాధ్యుడు గా మారి పనిచేశారని విమర్శించారు. ఇక విమర్శలు, ప్రతివిమర్శలతో ఓరుగల్లు రాజకీయం వేడెక్కింది. ఎన్నికలకు సమయం ఉండటంతో వీరి మధ్య డైలాగ్‌ వార్‌ మరింత ముదిరే అవకాశం కూడా ఉంది. మరి ఎలాగైనా గెలిచి తీరాలన్న కసిలో ఉన్న ముగ్గురిలో ప్రజలు ఎవరి వైపు ఉంటారు…? విజయం ఎవరికి వరిస్తుంది..? వరంగల్‌లో ఎవరి జెండా ఎగురనుంది అనేది ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్