జాతీయ రహదారుల అంశం పై ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా NHAI అధికారులతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లతోపాటు అటవీశాఖ అధికారులు హాజరుకానున్నారు. నిన్న సీఎం నివాసంలో NHAI ఉన్నతాధికారులు సీఎంను కలిశారు. NHAI చేపడుతున్న రహదారుల నిర్మాణంలో తలెత్తుతున్న భూ సేకరణ, ఇతర సమస్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్, మన్నెగూడ రహదారి పనులను వెంటనే మొదలుపెట్టాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి. కాంట్రాక్టు సంస్థతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు మొదలుపెట్టాలని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రీజినల్ రింగు రోడ్డు నిర్మాణానికి సహకరించాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను కోరారు. తెలంగాణకు తీరప్రాంతం లేనందున డ్రైపోర్టును ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం బందరు పోర్టును అనుసంధానం చేసేలా హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం చేపట్టాలని సూచించారు. హైదరాబాద్- కల్వకుర్తి జాతీయ రహదారి పనులు మొదలుపెట్టాలన్నారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణ పురోగతిపై ప్రతివారం నివేదిక ఇవ్వాలని సీఎంవో కార్యదర్శి షానావాజ్‌ను రేవంత్ ఆదేశించారు. ఇక ఈ ఇబ్బందులను పరిష్కరించే నేపథ్యంలో ఇవాళ సెక్రటేరియట్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు సీఎం.
ఈ సమావేశంలో ప్రధానంగా ప్రాజెక్టుల నిర్మాణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో తలెత్తే సమస్యలపై చర్చించనున్నారు. ఈక్రమంలో మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ కారిడార్ NH 63 భూ సేకరణ, ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల NH 63 భూ సేకరణ, NH 44 తోపాటు కాళ్లకల్ల-గుండ్ల పోచంపల్లి రహదారి భూ సేకరణ, జాతీయ రహదారుల నిర్మాణంలో విద్యుత్ సంస్థలతో వస్తున్న సమస్యలపై చర్చించనున్నారు. అలాగే ఖమ్మం-దేవరపల్లి , ఖమ్మం-కోదాడ రహదారుల నిర్మాణంలో పోలీస్ భద్రతపై కూడా చర్చకు రానుంది.