India budget 2023 date: వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు…ఎప్పటిలా బడ్జెట్ లో ఎడాపెడా వాయిస్తే, పప్పులు ఉడకవు. అందుకే ఈసారి కేంద్ర బడ్జెట్ లో మధ్యతరగతి వారికి పెద్ద పీట వేయాలని తీర్మానించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించడం విశేషం.
అందుకే అమ్మలా ఆదరిస్తే నిర్మలమ్మ బడ్జెట్, లేదు దండిస్తే మాత్రం నిర్మలా మేడమ్ బడ్జెట్ అని కొందరు వ్యాక్యానిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో మధ్య తరగతి వారిని మెప్పించాలంటే పన్ను పోటు ఉండకూడదు. అందుకే ఈసారి రూ.5లక్షల వరకు వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు ఉన్న పరిమితిని రూ.5 లక్షలకు పెంచే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రస్తుతం స్లాబ్ ల ప్రకారం రూ.2.5 లక్షల వరకు ఆదాయపన్ను లేదు.
ఆ పై నుంచి రూ. 5 లక్షల వరకు 5 శాతం పన్ను వర్తిస్తుంది.
రూ.5 లక్షలు- రూ.7.5 లక్షల వరకు 10 శాతం
రూ.7.5 లక్షలు-రూ.10 లక్షల వరకు 15 శాతం
రూ.10 లక్షలు-రూ.12.5 లక్షల వరకు 20 శాతం
రూ.12.5లక్షలు-రూ.15 లక్షల వరకు 25 శాతం
ఇక రూ.15 లక్షల పైన ఎంత ఆదాయం ఉన్నా సరే 30శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లను తగ్గించి, కొత్త స్లాబులను తీసుకురావాలని యోచిస్తున్నట్టు రాయటర్స్ వార్తా సంస్థ తెలిపింది. అయితే దీనిపై ప్రధాని కార్యాలయం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆఖరి నిమిషంలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే తప్పవని, అవి సరిచేసి బడ్జెట్ సమర్పిస్తారని అంటున్నారు.
పాత పన్ను విధానంలో మూడు స్లాబులే ఉండగా వాటికి మార్పులు చేసి, కొత్తగా ఆరు స్లాబుల విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఇందులో పన్ను మినహాయింపులు ఏవీ ఉండవని అంటున్నారు. ఇది మధ్య తరగతివారికి అశనిపాతమే అంటున్నారు. అలాగే జరిగితే వారికి ప్రాణాధారమైన గృహ రుణాలు, ఇన్సూరెన్స్ లు, ఎల్ఐసీ, ఎస్ బీఐ పాలసీలు, ఎడ్యుకేషన్ లోన్లు, ఇంటి అద్దెలు తదితర వాటికి పన్ను మినహాయింపుల నుంచి తీసేస్తే…ఎలాగరా? భగవంతుడా? అనుకుంటున్నారు.
రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నప్పుడు ఇవన్నీ అవసరం లేదని అనుకుంటున్నారేమో తెలీదు.
మొత్తానికి మధ్యతరగతి వారికి అనుకూలమని అనుకుంటే మాత్రం…ఇలా చేస్తే కుడి చేత్తో ఇచ్చి, ఎడమ చేతితో తీసుకున్నట్టే అని అప్పుడే కొందరు వ్యాక్యానిస్తున్నారు. ఏది ఏమైనా సాధ్యమైనంతవరకు మాత్రం మధ్యతరగతినే టార్గెట్ చేసి వారికి పెద్దపీట వేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రూ.15 లక్షలు ఆపైన ఆదాయం ఉన్నవారికి 30శాతం పన్ను వర్తిస్తోంది.ఈ మొత్తాన్ని పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. బహుశా రూ.20 లక్షలు ఆదాయం దాటిన వారికి 30 శాతం పన్ను వసూలు చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
లోక్ సభకు ఏడాది మాత్రమే ఎన్నికలకు సమయం ఉన్నందున సంక్షేమానికి పెద్ద పీట వేస్తారని పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట ఇస్తారని అంటున్నారు. పన్ను పోటు లేకుండా ప్రజారంజక బడ్జెట్ గా దీనిని తీర్చదిద్దనున్నట్టు సమాచారం.