తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటివరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల కాస్త మెతక వైఖరి అవలంబిస్తున్నారనే విమర్శలకు చెక్ పెడుతూ.. కమలం పార్టీపై ఆపరేషన్ ఆక్రమణ్ మొదలుపెట్టారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీనే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న రేవంత్.. రాష్ట్ర నేతలను టార్గెట్ చేస్తూనే నేరుగా కేంద్రానికి డెడ్ లైన్లు విధిస్తున్నారు. ఆదిలాబాద్ వేదికగా మహారాష్ట్ర భూముల వ్యవహారం నుంచి వడ్ల కొనుగోళ్ల దాకా బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేసేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఇంతకీ రేవంత్ రెడ్డి అకస్మాత్తుగా బీజేపీపై ఇంతలా ఎందుకు విరుచుకుపడుతున్నారు? జూన్ 15 తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి?
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నెరపుతూ వచ్చిన రేవంత్ రెడ్డి, బీజేపీ పట్ల కొంత మెతక వైఖరిని అవలంబిస్తున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా ఉండేది. అయితే, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన తన రూటును పూర్తిగా మార్చేశారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా, కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ మాత్రమేనని రేవంత్ రెడ్డి ఒక స్థిరమైన అంచనాకు వచ్చారు. దీంతో కమలం పార్టీకి ఏమాత్రం రాజకీయ స్పేస్ ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతో అత్యంత దూకుడుగా వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూనే, వారి ద్వారా నేరుగా ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి తగిలేలా ఆయన విమర్శల దాడిని పెంచారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ, వారికి బహిరంగంగా డెడ్ లైన్లు విధించడం ద్వారా రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
బీజేపీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక దాడికి ఆదిలాబాద్ జిల్లా వేదికగా మారింది. అక్కడ పర్యటించిన ఆయన స్థానిక బీజేపీ నేతలతో పాటు జాతీయ నాయకత్వానికి కూడా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఆయన తీవ్రంగా ఎండగట్టారు. గతంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం, తెలంగాణకు చెందిన ఏడు మండలాలను రాత్రికి రాత్రే ఆంధ్రప్రదేశ్ లో కలిపిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన నిలదీశారు. ఆదిలాబాద్ కు ప్రాణాధారమైన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం కోసం పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కనీసం రెండు వేల ఎకరాల భూమిని ఇప్పించలేరా అంటూ బీజేపీ సర్కార్ పై ఆయన విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్నది బీజేపీ కూటమి ప్రభుత్వమే అయినప్పటికీ, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎన్ని అధికారిక లేఖలు రాసినా అక్కడి ముఖ్యమంత్రి ఏమాత్రం స్పందించడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దీనికి పూర్తి బాధ్యత బీజేపీదేనంటూ ఆయన ప్రజల ముందు వాస్తవాలను ఉంచారు.
ప్రాజెక్టుల అంశంతో పాటు రైతాంగ సమస్యలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంపై సమరశంఖం పూరించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆయన తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. తెలంగాణ రైతాంగం పండించిన పంటను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను సంపూర్ణంగా నెరవేరుస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే తమ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి డెబ్భయి ఐదు లక్షల క్వింటాళ్ల వడ్లను కొనుగోలు చేసిందని, ఆ భారీ ధాన్యం నిల్వలను వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. రైతుల కష్టార్జాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం సరికాదన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఒక ఆసక్తికరమైన సామెతను వాడుతూ బీజేపీ నేతలకు చురకలంటించారు. సత్రంలో పెట్టే ఉచిత భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమండేషన్ ఎందుకు అన్నట్లుగా, రైతుల నుంచి ధాన్యం కొనాల్సిన కనీస బాధ్యత కేంద్రానిదే అయినప్పుడు, దానికి రాష్ట్ర బీజేపీ నేతల సిఫార్సులు, గొప్పలు ఎందుకని ఆయన ఎద్దేవా చేశారు.
ధాన్యం కొనుగోళ్ల వివాదంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా టార్గెట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం కొనుగోలు చేసిన పంటను కేంద్రం తీసుకునేలా చేయాల్సిన పూర్తి బాధ్యత కిషన్ రెడ్డిదేనని ఆయన తేల్చి చెప్పారు. కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్ర రైతాంగానికి మేలు చేయలేకపోతే ఆ పదవి ఎందుకని ఆయన ప్రశ్నించారు. రైతుల పక్షాన నిలబడి పంటను కేంద్రం తీసుకునేలా ఒప్పించకపోతే, కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి వస్తుందని రేవంత్ రెడ్డి అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. రైతుల ఆగ్రహ కట్టలు తెంచుకుంటే కేంద్ర మంత్రులను సైతం గ్రామాల్లోకి రానివ్వరని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. రాష్ట్ర బీజేపీ నాయకులు కేవలం ప్రెస్ మీట్లకు, విమర్శలకే పరిమితం కాకుండా, ఢిల్లీలో తమ పలుకుబడిని ఉపయోగించి తెలంగాణకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డికి నేరుగా బాధ్యతలు అప్పగించడం ద్వారా బీజేపీని రాజకీయంగా ఆత్మరక్షణలో పడేసే వ్యూహాన్ని రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు.
బీజేపీ నేతలకు కేవలం మాటలతో సరిపెట్టకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్దిష్టమైన డెడ్ లైన్ విధించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. జూన్ 15వ తేదీ నాటికి రాష్ట్రంలో ఉన్న ధాన్యం నిల్వలను కేంద్ర ప్రభుత్వం తీసుకోకపోతే, ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గరే తేల్చుకుంటామని ఆయన ఒక భారీ అల్టిమేటం జారీ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే లక్షలాది క్వింటాళ్ల ధాన్యాన్ని నేరుగా నాంపల్లిలోని కమలం పార్టీ ఆఫీసు వద్దకే తీసుకువచ్చి పారబోస్తామని ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేవలం వడ్లు మాత్రమే కాకుండా, తెలంగాణ రైతులు పండించిన జొన్నలు, మొక్కజొన్నలను కూడా కేంద్రం బేషరతుగా కొనుగోలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. జూన్ 15 దాటితే కాంగ్రెస్ శ్రేణులు, రైతాంగంతో కలిసి తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు. రేవంత్ రెడ్డి తాజా హెచ్చరికలతో ఆయన బీజేపీపై యుద్ధం ప్రకటించారని, తన రాజకీయ రూటును మాస్ లీడర్ గా మార్చుకుంటూ దూకుడు పెంచారని స్పష్టంగా అర్థమవుతోంది.


