37.2 C
Hyderabad
Monday, May 11, 2026
spot_img

నేను బీజేపీని ఓడించిన ముఖ్యమంత్రిని..రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ.. విభజించి పాలించడం బీజేపీ విధానమని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తాజా చిట్‌చాట్‌లో కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సమన్వయం తప్పనిసరి అని స్పష్టం చేసిన ఆయన.. రాజకీయంగా మాత్రం బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించినట్లు సీఎం తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్‌కు కేంద్రం 50 శాతం నిధులు ఇవ్వాలని, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, ఎయిర్‌పోర్టులు, డిఫెన్స్ ల్యాండ్స్, మూసీ అభివృద్ధి, జాతీయ రహదారులు వంటి అంశాలపై కేంద్ర సహకారం కోరినట్లు వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అనేక ప్రాజెక్టులు పెండింగ్‌లో పడ్డాయని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని క్లియర్ చేస్తున్నామని చెప్పారు.

ప్రధాని మోదీ కలిసి పనిచేద్దాం.. అన్న వ్యాఖ్యలపై స్పందించిన సీఎం.. అది తనను కాదని.. తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి అన్న మాట అని స్పష్టం చేశారు. “నేను బీజేపీని ఓడించిన ముఖ్యమంత్రిని” అని పేర్కొంటూ, కాంగ్రెస్‌పై విమర్శలు అంటే తనపై విమర్శలేనని అన్నారు. అభివృద్ధి అంశాలపైనే తమ మధ్య చర్చ జరిగిందని, అందులో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు.

బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి.. “బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ” అంటూ విమర్శించారు. విభజించి పాలించడం బీజేపీ విధానమని, ముస్లింలు, క్రిస్టియన్లు, మావోయిస్టులు కూడా ఈ దేశ ప్రజలేనని అన్నారు. తమ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వారిని బీజేపీ ఖతం చేయాలని చూస్తే.. కాంగ్రెస్ మాత్రం వారిని సమాజంలో కలపాలని చూస్తుందని పేర్కొన్నారు.

మావోయిస్టుల సమస్యపై మాట్లాడుతూ.. తెలంగాణలో 818 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో స‌రెండ‌ర్లు జరిగాయని చెప్పారు. “బుల్లెట్ కాదు బ్యాలెట్” అన్న సిద్ధాంతంతోనే మావోయిస్టులను జన జీవన స్రవంతిలోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. గణపతి వంటి మావోయిస్టు నేతలు కూడా సమాజంలో కలవాలని, అవసరమైతే ప్రభుత్వం వైద్య, ఆర్థిక సహాయం కూడా అందిస్తుందని వెల్లడించారు.

విదేశీ విధానంపై కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ.. బంగారం కొనొద్దు, విదేశీ ప్రయాణాలు తగ్గించండి అని ప్రజలకు ప్రధాని పిలుపునివ్వడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. దేశ ఆర్థిక పరిస్థితులను సమర్థంగా నిర్వహించలేక ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ మొదటి నుంచీ ఇదే విషయాన్ని చెబుతున్నారని పేర్కొన్నారు.

మహిళా రిజర్వేషన్లు, లోక్‌సభ సీట్ల పెంపు, జమిలి ఎన్నికలు, ఎస్‌ఐఆర్ వంటి జాతీయ రాజకీయ అంశాలపైనా సీఎం స్పందించారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల తొలగింపు వంటి చర్యలతో బీజేపీ ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తోందని విమర్శించారు.

ధాన్యం కొనుగోలు, అకాల వర్షాల ప్రభావం, పంట మార్పిడి వంటి వ్యవసాయ అంశాలపైనా ప్రభుత్వం దృష్టి పెట్టిందని సీఎం చెప్పారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని, రైతులకు పంట మార్పిడి అవసరాన్ని క్షేత్రస్థాయిలో వివరించనున్నట్లు వెల్లడించారు.

 

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్