జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ రూట్ మ్యాప్‌ను పూర్తిగా మార్చేస్తున్నారు. రాబోయే ఎన్నికల నాటికి పార్టీని ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దేందుకు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. పొరుగు రాష్ట్రం తమిళనాడులో నటుడు విజయ్ సాధించిన సక్సెస్‌ను చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆలోచనా ధోరణిలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. కేవలం పొత్తులపైనే ఆధారపడకుండా, క్షేత్రస్థాయిలో పార్టీ పునాదులను పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ చేయబోయే ఆ సమూల మార్పులు పార్టీకి ఏ మేరకు మేలు చేయబోతున్నాయి? కూటమిలో తన ప్రాధాన్యతను, సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు జనసేనాని వేస్తున్న మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని అధినేత పవన్ కళ్యాణ్ ఒక బలమైన నిర్ణయానికి వచ్చారు. ఒక రాజకీయ పార్టీ సుదీర్ఘకాలం మనగడ సాగించాలంటే ఆ పార్టీకి పునాదులు గ్రామ స్థాయి నుంచే బలంగా ఉండాలి. ఈ వాస్తవాన్ని గ్రహించిన పవన్ కళ్యాణ్, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే జిల్లాల వారీగా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు బాధ్యులను నియమించారు. రాబోయే పంచాయతీ, మండల పరిషత్, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున అత్యధిక స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దించాలని ఆయన నిర్ణయించారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం ద్వారా గ్రామ, వార్డు స్థాయిలో పార్టీకి ఒక బలమైన నాయకత్వం తయారవుతుందని ఆయన భావిస్తున్నారు. ఆ నాయకత్వమే రేపు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు వెన్నెముకలా నిలుస్తుందన్నది జనసేనాని వ్యూహంగా స్పష్టమవుతోంది. పై స్థాయి నుంచి కిందకు కాకుండా, కింద స్థాయి నుంచే పార్టీని నిర్మించుకుంటూ రావాలని ఆయన కార్యాచరణ సిద్ధం చేశారు.
జనసేనాని ఆలోచనలు మారడానికి జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిణామాలు కూడా ఒక ప్రధాన కారణం. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ అనూహ్య విజయాలు సాధిస్తుండటం పవన్ కళ్యాణ్ దృష్టిని ఆకర్షించింది. వాస్తవానికి విజయ్‌కు ఉన్న పాపులారిటీ, మాస్ ఫాలోయింగ్ కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకున్న క్రేజ్, ఫాలోయింగ్ అత్యధికంగా ఉన్నాయన్న వాస్తవాన్ని పవన్ విశ్లేషించుకుంటున్నారు. తన పిలుపు కోసం ఎదురుచూసే లక్షలాది మంది యువత ఆయనకు సొంతం. వీటికి తోడు రాష్ట్రంలో అత్యంత బలమైన ఓటు బ్యాంకు కలిగిన కాపు సామాజిక వర్గం మద్దతు జనసేనకు పుష్కలంగా ఉంది. తనకున్న ఈ అపారమైన బలాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని, భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలని పవన్ కళ్యాణ్ గట్టిగా భావిస్తున్నారు. కేవలం మద్దతుదారుడిగానో, పరిమిత స్థానాలకు పోటీ చేసే నాయకుడిగానో కాకుండా.. ప్రభుత్వాలను శాసించే కింగ్ మేకర్‌గా లేదా నేరుగా పవర్ లోకి వచ్చే స్థాయికి పార్టీని తీసుకువెళ్లాలని ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. తనకున్న ఇమేజ్‌ను పూర్తి స్థాయి పొలిటికల్ మైలేజ్‌గా మార్చుకోవడానికి ఇదే సరైన సమయమని ఆయన భావిస్తున్నారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ ఒక చిన్న శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విశ్రాంతి సమయంలోనే ఆయన పార్టీ భవిష్యత్ ప్రణాళికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఆయన పూర్తిగా కోలుకుని తిరిగి యాక్టివ్ అయిన వెంటనే ఏపీ వ్యాప్తంగా విస్తృతంగా జిల్లాల పర్యటనలు చేయాలని నిర్ణయించారు. ఈ పర్యటనల ద్వారా క్యాడర్ లో నూతనోత్సాహాన్ని నింపనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీ స్వరూపాన్ని మార్చేయాలని సీనియర్ నేతలతో చర్చిస్తున్నారు. గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పొత్తు ధర్మంలో భాగంగా జనసేన కేవలం ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. కానీ వచ్చే ఎన్నికల్లో ఆ సంఖ్యను భారీగా పెంచాలని, కనీసం యాభైకి పైగా స్థానాలను కూటమిలో కచ్చితంగా డిమాండ్ చేయాలని జనసేనాని యోచిస్తున్నారు. ఆ యాభై స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వడానికి వీలుగా, ఇప్పటి నుంచే ఆయా నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వాన్ని రెడీ చేయాలన్న భావనలో ఆయన ఉన్నారు. సమయం వచ్చినప్పుడు స్థానాలు అడగడం కాకుండా, ముందు నుంచే బలమైన క్యాండిడేట్లను సిద్ధం చేసుకుని అధిపత్యం ప్రదర్శించాలని పవన్ ఒక క్లియర్ రోడ్ మ్యాప్ తో ముందుకు వెళుతున్నారు.
పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ సంస్థాగత లోపాలను కూడా సరిదిద్దుకునే పనిలో పడ్డారు. గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నేతలకే టికెట్లు, పదవులు ఎక్కువగా వచ్చాయన్న అసంతృప్తి జనసేన నాయకత్వంలో, క్యాడర్‌లో బలంగా నాటుకుపోయింది. ఈ విషయాన్ని పసిగట్టిన జనసేనాని, వచ్చే ఎన్నికల్లో మాత్రం పార్టీ కోసం కష్టకాలంలో నిలబడి పనిచేసిన వారికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని దృఢంగా డిసైడ్ అయ్యారు. ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చే ప్యారాచూట్ నేతలకు, నాయకులకు ఈసారి ప్రయారిటీ ఇవ్వకూడదని ఆయన భావిస్తున్నారు. ఇతర పార్టీలకు జనసేన ఒక డంపింగ్ యార్డ్ లా మారిపోయిందని, అందరితో జనసేనను నింపేశారన్న ముద్ర నుంచి పార్టీని పూర్తిగా బయటపడేయాలని పవన్ కళ్యాణ్ బలంగా కోరుకుంటున్నారు. కష్టపడిన వారిని గుర్తిస్తేనే పార్టీ పట్ల కార్యకర్తల్లో అంకితభావం పెరుగుతుందని ఆయన గ్రహించారు. అసలైన జనసైనికులకు చట్టసభల్లోకి వెళ్లే అవకాశం కల్పించడం ద్వారా, పార్టీలో ఎప్పటినుంచో పేరుకుపోయిన అసంతృప్తికి శాశ్వత చెక్ పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు.
వలస నేతలను దూరం పెట్టడంతో పాటు, తన సొంత కుటుంబ సభ్యులను సైతం ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంచాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. కుటుంబ పాలన అనే విమర్శలకు ఏమాత్రం తావు లేకుండా ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి సమూల మార్పులతో జనసేన పార్టీని ప్రజల ముందుకు ఒక సరికొత్త బ్రాండ్‌తో తీసుకురావాలన్నది ఆయన యోచన. మరోవైపు కూటమిలో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా పవన్ కళ్యాణ్ ఒక బలమైన సంకేతం పంపబోతున్నారు. ఏపీలో కూటమి అవసరం జనసేనకు ఎంత ఉందో, టీడీపీకి కూడా అంతే ఉందన్న వాస్తవాన్ని ఆ పార్టీ నాయకత్వానికి గట్టిగా అర్థమయ్యేలా చెప్పాలని ఆయన డిసైడ్ అయ్యారు. జనసేన మద్దతు లేకుండా విజయం సాధ్యం కాదన్న విషయాన్ని స్పష్టం చేయనున్నారు. మొత్తం మీద పాత తప్పులను సరిదిద్దుకుని, పార్టీలోని మురికిని కడిగేసి, ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసులో నిఖార్సైన కొత్త నీటితో వచ్చే ఎన్నికల సమరంలోకి దిగేందుకు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయో భవిష్యత్ రాజకీయాలే నిర్ణయిస్తాయి.


