ఒక్కసారిగా ఇజ్రాయెల్‌పైకి దూసుకొచ్చిన వేలాది రాకెట్లు.. ప్రతిగా హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజాలో భీకర దాడులు.. ఇలా ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి నేటితో ఆరు నెలలు పూర్తయింది. దాదాపు 500 కిలోమీటర్లమేర విస్తరించి ఉన్న హమాస్ సొరంగాల్లో చాలావరకు ధ్వంసం చేశామని… 13 వేల మంది ఉగ్రవాదులను హతమార్చామని ఇజ్రాయెల్ చెబుతోంది. మరోవైపు ఇప్పటికీ 100కు పైగా బందీలు మిలిటెంట్ల చెరలోనే ఉన్నారు. గాజాలో 33 వేలమంది ప్రాణాలు కోల్పోవడం యావత్ ప్రపంచాన్ని కలవర పెడుతోంది.
ఆపరేషన్ అల్-అక్సా స్ట్రామ్ పేరిట గతేడాది అక్టోబర్ 7వ తేదీ తెల్లవారుజామున మెరుపుదాడికి పాల్పడిన హమాస్ మిలిటెంట్లు.. దాదాపు 12వందల మందిని బలిగొన్నారు. 250 మందికిపైగా బందీలుగా చేసుకుని, గాజాకు తీసుకెళ్లారు. ఈ పరిణామంతో ఉలిక్కిపడిన ఇజ్రాయెల్.. ప్రతిదాడులను మొదలుపెట్టింది. ఉగ్రవాదుల అంతంతోపాటు బందీల విడుదలే లక్ష్యంగా పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించింది. ఇప్పటివరకు 109 మంది బందీలు సురక్షితంగా విడుదల య్యారు. ముగ్గురిని సైన్యం నేరుగా కాపాడింది. 36 మంది వరకు బందీలు చనిపోయి ఉండొచ్చని ఇజ్రాయెల్ భావిస్తోంది. తమ వారిని విడిపించాల్సిందిగా ప్రధాని నెతన్యాహుపై బాధితుల కుటుంబీకులు, పౌరుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.
దాడులను వెంటనే ఆపాలని అనేక దేశాలు ఇజ్రాయెల్‌ను డిమాండ్ చేస్తున్నాయి. గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఐరాస భద్రత మండలి, మానవహక్కుల మండలిలు తీర్మానం రూపంలో గొంతెత్తాయి. నవంబరులో ఓసారి కాల్పుల విరమణ సాధ్యమైనప్పటికీ.. మరోసారి ఈ అంశం చర్చల దశ లోనే నిలిచిపోయింది. హమాస్‌ను అంతం చేసేవరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని నెతన్యాహు స్పష్టం చేస్తున్నారు. ద్విదేశ పరిష్కారాన్ని వ్యతిరేకిస్తోన్న ఆయన తీరుపై మిత్రదేశం అమెరికా సైతం పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది.హమాస్ చెరలో బందీగా ఉన్న ఓ రైతు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం ఇవాళ జరగనున్న మరో రౌండ్ చర్చలకు హమాస్ బృందం కైరో వెళుతున్న సమయంలో ఈఘటన వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన బందీని కిబుట్స్ నిర్ ఓజ్‌కు చెందిన ఎలాద్ కట్జిర్‌గా గుర్తించారు. హమాస్ చెరలోనే 36 మంది వరకు బందీలు ప్రాణాలు కోల్పోయారు.


