స్వతంత్ర, వెబ్ డెస్క్: నేటి కాలం పిల్లలు స్మార్ట్ ఫోన్‌లకు బాగా అడిట్ అవుతున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ గేమ్స్‌కు వ్యసనపరులుగా మారిపోతున్నారు. బిజీ జీవితంలో తల్లిదండ్రులు పర్యవేక్షణ కొరవడడంతో మొబైల్‌లోనే కొత్త ప్రపంచాన్ని వెతుక్కుంటున్నారు. చివరకు పేరెంట్స్‌తో పాటు వారు కూడా చిక్కుల్లో పడుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అంబర్‌పేట ప్రాంతంలో నివాసం ఉండే 16 ఏళ్ల బాలుడు ‘‘ఫ్రీ ఫైర్ గేమ్’’ ఆడుతూ ఏకంగా తల్లి ఖాతాలోని రూ.36లక్షలను పోగొట్టాడు. బాలుడు తన తాత మొబైల్ ఫోన్‌లో ‘ఫ్రీ ఫైర్ గేమింగ్’ యాప్‌ను మొదట డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఇది ఉచితంగా ఆడుకునే గేమ్ అయితే ఆటలో మరిన్ని లెవల్స్ ఆడాలంటే మాత్రం డబ్బు వెచ్చించాలి.
ఇలా మొదట తల్లి ఖాతా నుంచి రూ.1500, తర్వాత రూ.10వేలు ఖర్చు చేశాడు. దీంతో గేమ్‌లో మరింత మజా ఉండడంతో దానికి బానిసగా మారాడు. రకరకాల లెవల్స్ అడేందుకు లక్షల్లో వెచ్చిస్తూ వచ్చాడు. అయితే ఇటీవల కొంత డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు బాలుడి తల్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వెళ్లగా.. ఆమె ఖాతాలో డబ్బు లేకపోవడంతో షాకైంది. SBI నుంచి రూ. 27లక్షలు, HDFC నుంచి రూ.9 లక్షలు ఖర్చు చేసినట్లు తేలింది. దీంతో బాలుడు ఆ గేమ్ కోసం మొత్తం రూ. 36 లక్షలను ఖర్చు చేశాడు. దీంతో సదరు మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్ అధికారి అయిన తన భర్త మరణించగా.. వచ్చిన డబ్బులను ఖాతాలో దాచుకున్నానని ఆమె తెలిపారు. తన భర్త జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బును కేవలం ఒక ఆట కారణంగా కోల్పోయానని బాధితురాలు కన్నీటి పర్యంతమవుతున్నారు.