కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్( Bandi Sanjay Kumar) కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేసు దర్యాప్తు చేపట్టిన పేట్‌బషీరాబాద్ పోలీసులు, బాధిత బాలికపై తీవ్రమైన లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో పోక్సో చట్టంలోని మరింత కఠినమైన సెక్షన్ 5(ల) రెడ్ విత్ 6ను జోడించారు. ఇదే సమయంలో నిందితుడు భగీరథ్‌కు బుధవారం విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.
బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా గత శుక్రవారం బీఎన్ఎస్ సెక్షన్లు 74, 75తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 11 రెడ్ విత్ 12 కింద కేసు నమోదైంది. అయితే అనంతర దర్యాప్తులో బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసులో తీవ్రత పెరిగినట్లు పోలీసులు భావించి కొత్త సెక్షన్లు చేర్చారు.
ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ సోమవారం పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి విచారణ పురోగతిని సమీక్షించారు. బాధితురాలి మొదటి వాంగ్మూలంలో పూర్తి వివరాలు లేవని భావించిన ఆమె, మంగళవారం బాలిక ఇంటికి వెళ్లి దాదాపు రెండు గంటలపాటు మాట్లాడినట్లు సమాచారం. భగీరథ్‌తో పరిచయం, తరువాత జరిగిన పరిణామాలు, లైంగిక వేధింపులపై సమగ్రంగా వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. అనంతరం కేసు దర్యాప్తు అధికారులతో సమావేశమైన తర్వాతే కొత్త సెక్షన్లు జోడించినట్లు సమాచారం.
ఇక కేసు నమోదైనప్పటి నుంచి భగీరథ్ అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా, ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లు తెలిపారు. చివరిసారిగా కరీంనగర్ జ్యోతినగర్ ప్రాంతంలో ఫోన్ లొకేషన్ కనిపించడంతో, అక్కడ ఉన్న ఆయన మేనమామ వైద్యుడు సీహెచ్ వంశీకృష్ణ నివాసానికి పోలీసులు వెళ్లారు. అయితే భగీరథ్ అక్కడ లేరని కుటుంబ సభ్యులు చెప్పడంతో నోటీసుల ప్రతిని వారికి అందజేశారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, గతేడాది అక్టోబర్ 25న భగీరథ్ బాధిత బాలికను నానక్‌రాంగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి 2 నుంచి 3 రోజులపాటు అక్కడే ఉండాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో మరికొందరు స్నేహితులు కూడా అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే నవంబర్ 13న మొయినాబాద్‌లోని ఓ ఫామ్స్టేలో కూడా ఇలాంటి వేధింపులే ఎదురైనట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. డిసెంబర్ 31 రాత్రి మరో ఫామ్‌హౌస్‌లో బ్రీజర్ తాగాలని బలవంతం చేసి, రాత్రి సమయంలో గదికి వచ్చి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. ఆ సమయంలో అక్కడ మరో ఐదుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నట్లు తెలిపారు.
ఈ ఘటనల సమయంలో అక్కడ ఉన్న వారి వాంగ్మూలాలను నమోదు చేసి, పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగించాలని పోలీసులు నిర్ణయించారు.


