నిమ్స్ ఆస్పత్రిలో చిన్నారులకు గుండె సర్జరీ చికిత్సలు విజయవంతం కావడంపై మంత్రి హరీశ్ రావు(Harish Rao) హర్షం వ్యక్తంచేశారు. చిన్నారులకు సర్జరీ కోసం బ్రిటన్ నుంచి వచ్చిన వైద్య బృందానికి నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైద్యులంతా కలిసి 9మంది చిన్నారులకు సర్జరీలు నిర్వహించారని తెలిపారు. ఎక్మో మీద ఉన్న చిన్నారికి కూడా సర్జరీ చేయడం గొప్ప విషయమని వైద్యులను ప్రశంసించారు. తనకు ఈ రోజు ఎంతో సంతోషంగా ఉందని.. సర్జరీ తర్వాత ఆ పిల్లలు నవ్వుతుంటే మనసు నిండిపోయిందని భావోద్వేగానికి గురయ్యారు. పుట్టిన రాష్ట్రంలో ప్రజలకు సేవ చేయాలని వచ్చిన డాక్టర్ రమణకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులు పుట్టిన గడ్డకు మేలు చేయాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.