తెలంగాణలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకపోవడంతో ఈ కంపెనీ బీర్లను నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బేవరేజెస్ లిమిటెడ్ ప్రకటించింది.
తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు బీర్ల సరఫరా బంద్ చేస్తున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించింది. కింగ్ ఫిషర్ బీర్లతో పాటు యూబీ గ్రూప్‌కు చెందిన హీనెకెన్ బీర్ల సరఫరా కూడా బంద్ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
సెబీ లిస్టింగ్ రెగ్యులేషన్స్‌లోని రెగ్యులేషన్ 30కి అనుగుణంగా తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(టీజీబీసీఎల్)కి బీర్ల సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది.
టీజీబీసీఎల్.. తన కంపెనీ బీర్ ప్రాథమిక ధరను 2019-20 నుంచి సవరించలేదని.. దీని ఫలితంగా తెలంగాణలో భారీ నష్టాలు వచ్చాయని పేర్కొంది. దీంతో పాటు గతంలో సరఫరా చేసిన బీర్లకు టీజీబీసీఎల్ చెల్లించాల్సిన బకాయిలు భారీగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఈ కారణాలతో తెలంగాణలో తమ బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.