మళయాళ నటి హనీ రోజ్‌కు వేధింపుల కేసులో కేరళలోని వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరును సిట్ అధికారులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అతనిని కీలకంగా భావిస్తున్నారు. అతనిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన తర్వాత వాయనాడ్ నుంచి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు.
దీనిపై స్పందించిన హనీ రోజ్.. ఇది తనకు ప్రశాంతమైన రోజు అని అన్నారు. ఈ విషయం గురించి చెప్పినప్పడు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ హామీ ఇచ్చారని చెప్పారు.
ఈ వారం ప్రారంభంలో సోషల్ మీడియా పోస్ట్‌లో.. తాను వేధింపులకు గురవుతున్నట్లు వివరించారు. కానీ ఆ పోస్టులో తనను వేధిస్తున్నవారి పేరు చెప్పలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని అరెస్టు చేశారు.
వివరణాత్మక విమర్శలు, లుక్స్‌పై వేసే సరదా జోక్స్, మీమ్స్‌ను స్వాగతిస్తానని.. వాటిని తాను పెద్దగా పట్టించుకోనని హనీరోజ్ చెప్పారు. కానీ ప్రతిదానికీ ఓ హద్దు ఉంటుందని తాను నమ్ముతానని అన్నారు. అసభ్యకరంగా చేసే ఏ కామెంట్స్‌ని అయినా తాను సహించబోనని కూడా హనీ రోజ్ అన్నారు.
ఆభరణాల వ్యాపార సంస్థ చెమ్మనూర్ గ్రూప్‌కు బాబీ చెమ్మనూరు ఛైర్మన్‌గా ఉన్నారు. 2012లో ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనాను కేరళకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించాడు.
అతనిపై ఆరోపణల నేపథ్యంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. చెమ్మనూరును విచారించేందుకు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.