ఖతార్‌లోని రస్ లఫాన్ సహజ వాయువు క్షేత్రంలో ఆదివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా మంటలు చెలరేగి కనీసం 54 మంది గాయపడగా, మరో 18 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. యుద్ధ సమయంలో ఇరాన్ బాంబు దాడి చేసిన అనంతరం కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు కార్మికులు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటన ఖతార్‌లోని రాస్ లాఫాన్ పారిశ్రామిక ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రపంచంలో అతిపెద్ద సహజ వాయువు ఉత్పత్తిదారుల్లో ఖతార్ ఒకటి కావడంతో, ఈ పేలుడు ప్రపంచ ఇంధన మార్కెట్లలో మరింత అనిశ్చితిని సృష్టించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఇరాన్ హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ కొనసాగించడంతో ఖతార్ తన సహజ వాయువు ఎగుమతులను నిలిపివేసింది. దీంతో ఖాతాదారులకు సరుకులను రవాణా చేయడం కష్టమైంది. అయితే ఇరాన్- అమెరికా మద్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ఇరాన్ తన నియంత్రణను కొంత సడలించడంతో, ఖతార్ మళ్లీ ఎగుమతి కార్యకలాపాలను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి బర్జాన్ గ్యాస్ సరఫరా కేంద్రంలో పునరుద్ధరణ పనులు జరుగుతుండగా భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగినట్లు ప్రభుత్వ రంగ సంస్థ ఖతార్ ఎనర్జీ వెల్లడించింది.


