ఏపీలోని విశాఖపట్నంకు చెందిన 27 ఏళ్ల ఐటీ ఉద్యోగిని ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో ఓ హోమ్‌స్టేలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. రాధా గాయత్రి గురుగ్రామ్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. ఢిల్లీలోని కిద్వాయ్ నగర్ ఈస్ట్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఆమె భర్త సౌమ్య శ్రీచరణ్‌తో కలిసి విహారయాత్రకు వచ్చింది. చరణ్ కూడా పుణెలో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు.
జూన్ 14 అర్ధరాత్రి తర్వాత గాయత్రి ఆమె భర్తతో కలిసి తిప్రిధర్‌లోని కియానా హోమ్‌స్టేకు చేరుకున్నారు. అంతకు ముందు రోజు ఢిల్లీ నుంచి రిషికేష్ చేరుకున్నారు. సుమారు రాత్రి 11.30 సమయంలో బ్లిస్స్ అనే గదిలోకి చెకిన్ అయ్యారు. రాత్రి దంపతులు ఆల్కహాల్ సేవించారు. అనంతరం 3.30 గంటలకు నిద్రపోయామని భర్త చెప్పారు. ఉదయం నిద్రలేచి చూసేసరికి భార్య గాయత్రి నగ్నంగా, చలనం లేకుండా నేలపై మూత్రంలో పడిఉందని చెబుతున్నారు. ఆమెకు ముక్కు నుంచి రక్తం కూడా కారుతోందని అన్నాడు. సమాచారం అందుకున్న ముస్సోరి పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. బెడ్‌షీట్ మీద రక్తపు మరకలు ఉన్నాయని.. రెండు ఖాళీ లిక్కర్ బాటిల్స్, ఫుడ్ ఐటమ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
జంటకు గత ఏడాది నవంబర్ 8న వివాహం అయింది. గాయత్రి, శ్రీచరణ్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన వారని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని డెహ్రాడూన్‌లోని కొరొనేషన్ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.


