మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. తనకు జడ్ ప్లస్ కేటగిరీని కుదించడాన్ని సవాలు చేస్తూ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది.
వైఎస్ జగన్కు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎందుకు ఇవ్వడం లేదని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జగన్కు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని సూచించింది. జామర్ ఏర్పాటుపై కూడా స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. జగన్కు జామర్ వెహికల్స్ను కూడా కేటాయిస్తామని వివరించింది. మాజీ ముఖ్యమంత్రికి ప్రభుత్వం భద్రత కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.