లాస్ ఏంజెల్స్‌లో పైకప్పులు, వాహనాలు, వీధులపై ప్రకాశవంతమైన పింక్ పౌడర్ దుప్పటిలా కప్పేసి కనిపిస్తుంది. దావనంలా వ్యాపిస్తున్న అడవి మంటలను ఎదుర్కోవడానికి ఎయిర్ ట్యాంకర్స్ పింక్ కలర్ పదార్థాన్ని వదులుతూనే ఉన్నాయి. మంటలు మరింత వ్యాపించకుండా ఉండేందుకు గత వారం రోజులుగా వేల గ్యాలన్ల పౌడర్‌ను వాడినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పింక్ పౌడర్ ఏమిటి? అడవి మంటలను అరికట్టడంలో ఇది ఎలా సహాయపడుతుంది?
పింక్ లిక్విడ్ ఎలా పనిచేస్తుంది?
ఈ పదార్ధం మంటలను నియంత్రణలోకి తెచ్చే అగ్ని నిరోధకంగా పనిచేస్తుంది. ఇందులో ప్రధానంగా అమోనియం పాలీఫాస్ఫేట్ వంటి రసాయన లవణాలు ఉంటాయి. 1960 దశకం నుంచి అమెరికా అంతటా దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. పెరిమీటర్ సొల్యూషన్స్ అనే సంస్థ దీన్ని తయారుచేస్తోంది. ఇది ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే అగ్నిమాపక మందుగా చెబుతారు.
గాలిలోని ఆక్సిజన్ వల్ల మంట మండుతుంది. ఈ రసాయన మిశ్రమం అగ్నికి ఆక్సిజన్ అందకుండా నిరోధిస్తుంది. దీంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందకుండా నియంత్రించే వీలుంటుంది. ప్రకాశవంతమైన గులాబీ రంగు అసాధారణంగా కనిపించవచ్చు, కానీ ఇది ఒక ముఖ్యమైన ప్రయోజనానికి ఉపయోగపడుతుంది.
ఈ గులాబీ రంగు లిక్విడ్ చల్లడం వల్ల ఆయా ప్రదేశాలను గుర్తించడానికి అగ్నిమాపక సిబ్బందికి సులభంగా వీలవుతుంది. మంటల వల్ల ప్రభావితమైన ప్రాంతాలను కూడా చాలా ఈజీగా గుర్తించగలుగుతారు.
పింక్ లిక్విడ్‌ను నేరుగా ఫైర్ మీద చల్లకుండా.. మంటలు అంటుకోకముందే ఆయా ఉపరితలాలపై చల్లుతారు. ఇది అగ్నికి ఆజ్యం పోయకుండా ఆక్సిజన్‌ను నిరోధిస్తుంది. తద్వారా మంటలు వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది.
అగ్ని నిరోధకాలతో ప్రమాదాలు ఉన్నాయా?
పింక్ పౌడర్ అడవి మంటలను ఎదుర్కోవడంలో శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతున్నా.. పర్యావరణ నిపుణులు పర్యావరణ వ్యవస్థలు మానవాళి ఆరోగ్యంపై దాని ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. NYT నివేదిక ప్రకారం, భారీ లోహాలతో సహా ఫైర్ నిరోధకాల్లోని రసాయనాలు పర్యావరణానికి విషపూరిత ముప్పును కలిగిస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ప్రతి ఏడాది మిలియన్ల గ్యాలన్ల పింక్ లిక్విడ్‌ను చల్లుతున్నారు. ఫలితంగా వన్యప్రాణులకు హాని కలుగుతుంది. జలమార్గాలను కలుషితం చేస్తుంది. అంతేకాకుండా మానవ ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది.