మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కేటీఆర్ విత్ డ్రా చేసుకున్నారు. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిరాకరించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరగాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇవాళ విచారణ సందర్భంగా సెక్షన్ 13(1) పై వాదనలు జరిగాయి. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1) వర్తించదంటూ కేటీఆర్ తరపున లాయర్ వాదనలు వినిపించారు. రూ.54 కోట్లు పొందిన సంస్థ నిందితుల జాబితాలో లేదు.. డబ్బు చెల్లించడం అవినీతి ఎలా అవుతుందని కేటీఆర్ లాయర్ వాదనలు వినిపించారు. అరెస్టు చేయాలనుకుంటే అరెస్టు చేసుకోవచ్చని చెప్పారు.
అత్యున్నత న్యాయస్థానం కేటీఆర్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో కేటీఆర్ పిటిషన్‌ను విత్ డ్రా చేసుకున్నారు. ఇక కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో ఊరట దక్కకపోవడంతో రేపు ఈడీ ముందు హాజరుకాబోతున్నారు కేటీఆర్.
కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సుదరం వాదనలు వినిపించారు. ఇది కక్ష సాధింపుతో పెట్టిన కేసని అన్నారు. ప్రభుత్వం మారగానే కేసు పెట్టారని ఆరోపించారు. ఇది ప్రభుత్వ ప్రాజెక్టు.. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని అన్నారు. డబ్బు తీసుకున్నవారిని, HMDAను నిందితులుగా చేర్చలేదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తరపున లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఫార్ములా ఈ రేసు కేసులో దర్యాప్తు జరగాలని అన్నారు. కేసు దర్యాప్తుకు గవర్నర్ అనుమతి ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.