PM Modi |ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ వ్యాప్తంగా పెను సంచలనాలు సృష్టిస్తోంది. రాజకీయ ప్రముఖుల పాత్ర ఈ కుంభకోణంలో ఉందనే ఆరోపణల నేపథ్యంతో పాటు.. పలువురు ప్రముఖుల అరెస్ట్‌తో ప్రతి రోజూ ఢిల్లీ మద్యం కుంభకోణం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ఢిల్లీ డిప్యూటీ సీఏం మనీష్ సిసోడియాను సైతం ఈ కేసులో సీబీఐ (CBI) అధికారులు అరెస్ట్ చేయడంతో రాజకీయంగానూ ఈకేసు కు ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు తెలంగాణ(Telangana) సీఎం కేసీఆర్ కుమార్తె కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకోవడంతో బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీ టార్గెట్‌గా విమర్శలు ఎక్కుపెడుతోంది. రాజకీయ కక్షలో భాగంగానే తమ పార్టీ నాయకురాలిని కేంద్రప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో వేధిస్తోందంటూ విమర్శిస్తోంది. తాజాగా బీఆర్‌ఎస్ (BRS) అధినేత కేసీఆర్‌తో పాటు 9మంది విపక్షనేతలు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. మనీష్ సిసోడియా అరెస్ట్‌ను ఖండిస్తూ రాసిన ఈ లేఖలో 9మంది విపక్ష నాయకులు సంతకాలు చేయగా.. పచ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్, ఉద్ధవ్ ఠాక్రే, ఫరూక్ అబ్దుల్లా, తేజస్వి యాదవ్, శరద్ పవర్, అఖిలేష్ యాదవ్ లు సంతకాలు చేశారు.
ప్రధానంగా కేంద్రప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ ఆలేఖలో పేర్కొన్నారు. భారత్ ఇప్పటికీ ప్రజాస్వామ్య దేశమని మీరు అంగీకరిస్తారని తాము ఆశిస్తున్నామని, ప్రతిపక్ష సభ్యులపై కేంద్రప్రభుత్వం రాజకీయ ప్రయోజకనాల కోసం దర్యాప్తు సంస్థల ప్రయోగిస్తోందని ఆరోపించారు. ఈ విధానాలు దేశం ప్రజాజాస్వామ్యం నుండి నిరంకుశ పాలనకు మారామని సూచిస్తున్నాయని లేఖలో తెలిపారు. 2023 ఫిబ్రవరి 26వ తేదీన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిందని, ఆయనపై చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, అవ్వన్నీ పూర్తిగా నిరాధారమైనవని, రాజకీయ కుట్రలో భాగమని లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలో పాఠశాలల స్థితిగతులను మార్చినందుకు సిసోడియా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారని తెలిపారు. అటువంటి వ్యక్తిని రాజకీయ కుట్రలో భాగంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని విపక్ష నేతలు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాసిన లేఖలో ఆరోపించారు.
గతంలోనూ అనేకమందిపై దర్యాప్తు సంస్థలను ప్రయోగించి.. కేసులు నమోదు చేశారని, వారిలో కొందరు బీజేపీలో చేరారని, కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్న వారిపై నమోదైన కేసుల్లో ఎటువంటి పురోగతి లేదన్నారు. కేవలం ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసి వేధించడం సరికాదని ప్రధానమంత్రికి రాసిన లేఖలో విపక్ష నేతలు పేర్కొన్నారు.