సికింద్రాబాద్‌లో సంచలనం సృష్టించిన చిలకలగూడ యావన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇది పూర్తిగా ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య అని సికింద్రాబాద్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి వెల్లడించారు. ప్రేమ వ్యవహారాన్ని కారణంగా చూపుతూ యువతి కుటుంబ సభ్యులే కలిసి యావన్‌ను దారుణంగా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితులతో పాటు ఒక మైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించడంతో పాటు, వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. మే 7 అర్ధరాత్రి సమయంలో ఈ హత్య జరిగింది. కేసు తీవ్రత దృష్ట్యా ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ కాల్ డేటా, స్థానికుల సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
మృతుడు యావన్, యువతి చంద్రిక ఇద్దరూ స్కూల్ రోజుల నుంచే స్నేహితులు. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంబంధాన్ని యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. గతంలో కూడా యావన్‌ను పలుమార్లు హెచ్చరించారు. అయితే ప్రేమ వ్యవహారం కొనసాగుతుండటంతో కుటుంబ సభ్యులు చివరకు హత్యకు ప్లాన్ చేసినట్లు విచారణలో బయటపడింది.
హత్యకు ఐదు రోజుల ముందే నిందితులు యావన్‌ను చంపేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. యావన్ కదలికలను గమనిస్తూ రెక్కీ కూడా నిర్వహించారు. ప్రధాన నిందితుడు అల్లబోయిన సాయి కిరణ్ ఈ హత్యకు మాస్టర్ మైండ్‌గా వ్యవహరించినట్లు పోలీసులు వెల్లడించారు. సాయి కిరణ్ యువతిని పెళ్లి చేసుకోవాలని భావించాడని, అందుకే యావన్‌ను అడ్డంకిగా భావించి హత్యకు పథకం రచించినట్లు తేలింది.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా అరెస్ట్ అయిన వారిలో A1 అల్లబోయిన సాయి కిరణ్ (27) చిల్కలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్‌గా ఉన్నాడు. అతడు యువతి బావ కావడం గమనార్హం. A2 రాజం పరమేష్ కుమార్ యాదవ్ యువతి సొంత సోదరుడు కాగా, A3 రాజం వంశీకృష్ణ, A4 రాజం మనీష్ కజిన్ బ్రదర్స్. A7 రాజం నర్సింహ యాదవ్ యువతి తండ్రి కాగా, A8 రాజం శ్రీశైలం యాదవ్, A9 రాజం మల్లేష్ యాదవ్ ఆమె బాబాయిలు.
దర్యాప్తులో మరో కీలక విషయం కూడా బయటపడింది. నిందితుల్లో A5 శ్రీగిరి రాహుల్, A6 కుచ్చుల శివనందన్ యాదవ్‌లకు గాంజా పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు ముందు వారు మత్తులో ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ గౌరవంగా తీసుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం నిందితులందరినీ రిమాండ్‌కు తరలించి, కేసుపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


