23.7 C
Hyderabad
Tuesday, October 14, 2025
spot_img

విశిష్టతల నిలయం మహిమాన్విత మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం

దర్పంతో దర్శనమిచ్చే సర్పాదీశ పుణ్యక్షేత్రాలు పవిత్ర భారతావనిలో ఎన్నెన్నో ఉన్నాయి. నాగదేవతలుగా, సుబ్రహ్మణ్యేశ్వరస్వామిగా సర్పాకార రూపంలో ఉన్న ప్రముఖ దేవళాలు ఎన్నో మనకు తెలుసు. అయితే, ఓ కుగ్రామంలో, ఆహ్లాదకర వాతావరణంలో నెలకొని సుబ్బారాయుడి గుడి ఘన చరిత్ర, అక్కడ చోటుచేసుకున్న ఆశ్చర్యకరంగా ఘటనలు చూస్తే..ఔరా అనిపిస్తుంది. అందుకే, పెళ్లిళ్లు కోరుకునేవారు, పిల్లలు పుట్టాలనుకునే వారు, ఈతి బాధలు తొలగిపోవాలనుకునే వారు, గ్రహ దోషాలు సమసిపోవాలనుకునే వారు ఈ పుణ్యక్షేత్రానికి వస్తున్నారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే పంట కాలువలు, పిల్ల కాలువలు, చెరువులు, నదులు, సముద్రాలు, పర్వతాలు, దేవాలయాలు, ఆధ్యాత్మిక వైభవాలు, గ్రామసీమలు.. ఇలా ఎన్నో కళ్లముందు తేలియాడుతాయి. ఇందులో.. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం అలవెల్లి కొత్త మల్లవరం గ్రామంలో ఓ పవిత్ర, మహిమాన్విత దేవాలయం నెలకొని ఉంది. అదే శ్రీ ఉమామహేశ్వర వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం. ఈ ఆలయ చరిత్ర ను చూస్తే, ఎన్నో ఆసక్తికర, అద్భుత విషయాలు దర్శనమిస్తాయి. వైద్యులకు సైతం అంతు చిక్కని మహిమ ఇక్కడ కనిపిస్తుందని భక్తులు చెబుతున్నారు.

ఆలయ చరిత్రను గమనిస్తే…. 1961 నవంబర్ 26న ఈ ప్రాంతానికి చెందిన ఓ రైతు తన పొలంలోకి వెళ్ళగా అక్కడ గోధుమ రంగు త్రాచుపాము కనిపించింది. అయితే, ఆ సర్పం మనుషులను చూసినా దర్పం ప్రదర్శించ లేదు, భయపడ లేదు, ఎవరినీ భయపెట్ట లేదు. చివరికి ఆ రైతు దానిని అటవీ ప్రాంతానికో, సర్ప సురక్షిత ప్రాంతానికో తరలిద్దామని ప్రయత్నించినా, అది కదలలేదు, మెదల లేదు. కొందరు ఆకతాయిలో ఆ పాముపై రాళ్లు రప్పలు వేసినా వారిపైన బుసలు కొట్టలేదు. పారిపోనూ లేదు. దీంతో.. అందరూ అక్కడ నుంచి నిష్క్రమించి ఆ ప్రాంతానికి వెళ్లడం మానివేశారు.

అదే ఏడాది డిసెంబర్ 18న ఓ భక్తుడు సాహసించి ఆ సర్పాన్ని తన కండువాలో గట్టిగా పట్టుకుని తీసుకొస్తున్నాడు. అయితే, ఇప్పుడు ఏ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఉందో…ఆ ప్రాంతానికి వచ్చేసరికి… ఆ సర్పం బరువు విపరీతంగా పెరిగిపోయింది. ఆ సర్పభారాన్ని మోయలేక.. ఆ వస్త్రాన్ని కిందకు దించేసి తన దారిన తాను వెళ్లిపోబోయాడు. అయితే, ఆ సర్పం అక్కడ ఉన్న శివలింగానికి చుట్టుకుని ఉండిపోయింది. దీన్ని ఆశ్చర్యంగా తిలకించిన ఆ వ్యక్తి, అనంతరం గ్రామస్థులకు తెలిపాడు. అక్కడ ఏం జరుగుతోందని గ్రామస్థులు దూరం నుంచి చూడడం మొదలెట్టారు.

ఆ సర్పం ప్రతి నిత్యం… ఎదుట నున్న కొలనులో బుడుంగున మునిగి, స్నాన అనంతరం శివలింగాన్ని చుట్టుకుని ఉండిపోవడం మొదలెట్టింది. తొలుత గ్రామస్థులు భయపడినా, కొన్నాళ్లకు ఆ సర్పం అంటే భయంపోయి, భక్తి భావం ఏర్పడింది. సర్పం చుట్టుకున్న శివలింగం వద్ద భక్తులు పూజలు చేయడం మొదలెట్టారు. పూజలు చేసినా, పుష్పాలు చల్లినా, క్షీరాభిషేకాలు చేసినా.. అక్కడ నుంచి ఇంచి సైతం కదిలేది కాదు. ఎవ్వరికీ ఏ హాని చేసేది కాదు. ఈ అద్భుత విషయం ఈ నోట, ఆ నోట అందరికీ తెలియడంతో పెద్ద ఎత్తున భక్తులు రావడం మొదలెట్టారు.

క్రమేపీ అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఎన్నో సంగీత భక్తి రస కార్యక్రమాలు అక్కడ ఏర్పాటు చేయడం మొదలెట్టారు. సంగీత, భక్తిరస కార్యక్రమాలకు ఆ సర్పం నృత్యం చేసి తిరిగి శివలింగం దరి చేరేదని… ఈ ప్రాంతవాసులు కథలు కథలుగా చెబుతున్నారు. గాన గంధర్వుడు, దివంగత ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు ఇక్కడ సంగీత కచేరీ చేశారని, ఆయన సన్నిధిలో ఉన్న హార్మోనియం పై కొద్దిసేపు సర్పం నిలబడిందని, ఆయన సైతం ఈ దృశ్యం చూసి నివ్వెరపోయారని నాటి దశాబ్దానికి చెందిన కొందరు భక్తులు తెలియజేస్తున్నారు.

ప్రతి నిత్యం పుణ్య కొలనులో స్నానం చేసి, శివ లింగం సన్నిధికి చేరడం….ఇలా దినచర్యతో గడిపిన ఆ సర్పం ఒకరోజున ఐహిక బంధాలు తెంచుకోవాలని నిర్ణయించుకుందో ఏమోగాని.. శివలింగంపై తన శిరస్సును పలుమార్లు కొట్టుకుని ప్రాణాలు కోల్పోయిందని… తమ పెద్దల ద్వారా ఈ విషయం తెలిసిందని కొందరు యువకులు చెబుతున్నారు. ఈ విషయాలన్నింటినీ బేరీజు వేసుకుని…. అది సామాన్య సర్పం కాదని..సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వరస్వామే.. తమను కరుణించడానికి ఈ రూపంలో వచ్చాడని గ్రామస్థులు భావించారు. అనంతరం, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని అట్టహాసంగాచేసి ఆలయం నిర్మించారు.

స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఎన్నో శుభాలు కలగడంతో.. వారు తమ అనుభవాలు ఇతరులతో పంచుకున్నారు. దీంతో, స్వామివారి మహిమలు సర్వవ్యాప్తం అయ్యాయి. ఇక్కడి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని మనసారా ఆరాధిస్తే ఈతి బాధలు తొలగిపోతాయని భక్తులు చెబుతున్నారు. వివాహాలు కానివారికి పెళ్లిళ్లు అవుతున్నాయని, సంతాన హీనులు సంతానవంతులు అవుతున్నారని, గ్రహదోషాలు తొలిగి సుఖశాంతులు కలుగుతున్నాయని భక్తులు తెలియజేస్తున్నారు. ఆలయ మహిమలు అందరికీ తెలియడంతో భక్తుల తాకిడి అధికం అవుతోంది. దీంతో, గ్రామస్థులు ఆలయాన్ని పునర్ నిర్మించారు. ఈ ఆలయ మహత్యాన్ని ధర్మకర్తలు విశ్వనాథం, భాస్కరరెడ్డి సవివరంగా తెలియజేశారు. ఆలయంలో ప్రతి మంగళవారం, షష్టి తిధి ఉన్న రోజు, మాస శివరాత్రికి విశేష పూజలు చేస్తామని, మహా శివరాత్రికి పెద్ద ఎత్తున విశేష పూజా కార్యక్రమాలు, విశేష అభిషేకాలు చేస్తామని ఆలయ అర్చకస్వామి సత్యనాథ్ తెలిపారు.

ప్రముఖ ప్రవచనకర్త, ఆధ్యాత్మిక స్రష్ఠ, ధార్మిక శ్రేష్ఠ, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఈ ఆలయ మహత్యం తెలుసుకొని ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ నిర్వాహకులు, భక్తులు తెలిపారు. తన కుమార్తెను ఇదే గ్రామానికి చెందిన యువకునికి ఇచ్చి వివాహం చేసారని భక్తులు చెప్పారు. చాగంటి కోటేశ్వరరావు ఎప్పుడైతే ఈ ఆలయం గురించి తమ ప్రవచనాల్లో చెప్పారో అప్పటి నుంచి ఈ ఆలయం వైభవం, మహత్యం గురించి మరింత ప్రాచుర్యం పొందిందని భక్తులు అంటున్నారు.

దశాబ్దాల క్రితం ఏ సర్పమైతే…ఇక్కడి కొలనులో స్నానం ఆచరించి శివార్చన చేసిందో, అదే రీతిలో ఇక్కడికి వచ్చే భక్తులు.. కొలనులో స్నానమాచరించి, స్వామివారికి పూజాదికాలు చేస్తారని, అనంతరం ఆలయం వెనుక ఉన్న మందిరంలో కాస్తసేపు విశ్రమించి వెళతారని, తమ కోర్కెలు తీరాక తిరిగి వస్తారని ఆలయ పెద్దలు, భక్తులు తెలియజేస్తున్నారు. ఎందరో ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శించుకున్నారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. దేశ మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత మర్రి చెన్నారెడ్డి ఈ ఆలయాన్ని దర్శించుకున్నారని చెబుతున్నారు. సుప్రీం కోర్టు, హైకోర్ట్ జడ్జిలతో పాటు ఎందరో ప్రముఖులు ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారని వివరిస్తున్నారు.

ప్రతి హిందువు ఒక్కసారైనా దర్శించాల్సిన పుణ్యక్షేత్రం ఏకే మల్లవరం లోని ఉమామహేశ్వర శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అని భక్తులు తెలియజేస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్