చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల కబ్జాపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఆక్రమణల వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో జరిగిన ఈ భూ అక్రమాలపై అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. 75 ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేర్చడంపై ఇప్పటికే సీఎం వద్దకు ప్రాథమిక నివేదిక చేరింది.
మరోవైపు…. పుంగనూరు, తంబళ్లపల్లి, రేణిగుంట మండలాల్లో రికార్డుల తారుమారు, బినామీ పేర్లతో వందల ఎకరాలను ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై పక్కా ఆధారాల సేకరణతో కఠిన చర్యలకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సచివాలయంలో రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్దిరెడ్డి భూ మాఫియా ఆగడాలు, తదుపరి చర్యలపై చర్చిస్తున్నట్లు సమాచారం.